డిబేట్ కు రెడీ.. ట్రంప్...కరోనా తగ్గితేనే అంటున్న బైడెన్
కరోనా తర్వాత కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు ఏ మాత్రం తగ్గటం లేదు. ప్రస్తుతం ఆయన వైట్ హౌస్ లో నే విశ్రాంతి తీసుకుంటూ వైద్యసేవలు పొందుతున్నారు. అక్టోబర్ 15న జరిగే డిబేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేశారు ట్రంప్. అయితే అమెరికా అధ్యక్షుడి ప్రస్తుత అరోగ్య పరిస్థితి ఎలా ఉందో తనకు తెలియదని..ఆయనకు కరోనా తగ్గితేనే తాను చర్చలో పాల్గొంటానని..కోవిడ్ నిబంధనల ప్రకారమే నడుచుకుంటానని డెమాక్రటిక్ అభ్యర్ధి జో బైడెన్ ప్రకటించారు. కోవిడ్ నుంచి ట్రంప్ పూర్తిగా కోలుకోని పక్షంలో అసలు డిబేట్ నిర్వహించడం సరికాదని బైడెన్ అభిప్రాయపడ్డారు. మూడు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ట్రంప్ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిస్థాయిలో మెరుగుపడిందని వైద్యులు చెబుతున్నారు.
మయామీలో జో బైడెన్‌తో రెండో డిబేట్‌కు తాను రెడీగా ఉన్నానని ట్రంప్ సైతం ప్రకటించారు. ట్రంప్ సలహాదారులు, అధికారుల్లో చాలామందికి కోవిడ్ సోకింది. డిబేట్‌లో వాళ్లు కూడా పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండో డిబేట్ నిర్వహణపై సస్పెన్స్ నెలకొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టమైన అధ్యక్ష అభ్యర్థుల ముఖాముఖి పలు దఫాలు జరుగుతుంది. తొలి డిబేట్ సెప్టెంబర్ 30న జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరూ ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకున్నారు. మరి రెండో డిబేట్ జరుగుతుందా? లేదా అన్నది వేచిచూడాల్సిందే.