అలా అయితే నేను రాను...ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల సమయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. అదే దూకుడు..అదే దురుసు ప్రవర్తన. ట్రంప్ కు ఇటీవల కరోనా సోకిన విషయం తెలిసిందే. ట్రంప్ కు కరోనా వైరస్ పూర్తిగా తగ్గిందని తేలితేనే తాను చర్చలో పాల్గొంటానని డెమెక్రాటిక్ అధ్యక్ష అభ్యర్ధి జో బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అధ్యక్షుల డిబేట్ ను నిర్వహించే కమిషన్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ (సీపీడీ) తాజాగా వర్చువల్ పద్దతిలో చర్చ నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే ఈ ప్రతిపాదనను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. అలా అయితే తాను చర్చలో పాల్గొనబోనని తేగేసి చెప్పారు. అయితే సీపీడీ కూడా అదే తరహాలో స్పందించింది. డిబేట్ గురించి మరో ఆలోచన ఉండబోదని తెలిపింది.
షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న ఇద్దరు అధ్యక్ష అభ్యర్ధుల మధ్య రెండవసారి చర్చ జరగాల్సి ఉంది. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్ వర్చువల్ డిబేట్ లో పాల్గొని..తాను సమయం వృధా చేయదలచుకోలేదని వ్యాఖ్యానించారు. ఇది తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. బైడెన్ ను రక్షించేందుకే సీపీడీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. డిబేట్ లో పాల్గొనే వారి ఆరోగ్యం, భద్రత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకునే తాము వర్చువల్ పద్దతిలో డిబేట్ కు ఓకే చేశామని..అలాగే జరుగుతుందని స్పష్టం చేసింది. బైడెన్ మాత్రం వర్చువల్ పద్దతిలో డిబేట్ లో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. మరి ట్రంప్ వ్యాఖ్యలతో ఈ సారి చర్చ ఉంటుందా? లేదా అన్న అంశంపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.