Telugu Gateway
Politics

కాంగ్రెస్ లోకి చెరుకు శ్రీనివాసరెడ్డి

కాంగ్రెస్ లోకి చెరుకు శ్రీనివాసరెడ్డి
X

దుబ్బాక ఉప ఎన్నికల వేళ కీలక పరిణామం. ఇంత కాలం అధికార టీఆర్ఎస్ లో కొనసాగిన చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి..కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన టీఆర్ఎస్ తరపున టిక్కెట్ ఆశించారు. కానీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ దుబ్బాక టిక్కెట్ ను దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకు కేటాయించారు. దీంతో శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ముత్యంరెడ్డికి మంచి పేరు ఉంది. దీంతో ఉప ఎన్నిక రాజకీయం మరింత రంజుగా మారినట్లు కన్పిస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శ్రీనివాస్‌తో పాటు పలువురు ద్వితీయ శ్రేణి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. శ్రీనివాస్‌ను కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆయనకు బంగారు భవిష్యత్ ఉండాలని కోరుకున్నారు. శ్రీనివాస్ తండ్రి ముత్యంరెడ్డి ఆదర్శ నాయకుడని.. దుబ్బాక నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ఉత్తమ్ కొనియాడారు. దుబ్బాక ఉపఎన్నిక.. తెలంగాణ భవిష్యత్ ఎన్నిక అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని అని నియోజకవర్గ ప్రజలను ఉత్తమ్ కోరారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక ఉపఎన్నిక ఆత్మగౌరవ ఎన్నిక అని అన్నారు. దుబ్బాక కు కనీసం బస్సు-నీళ్లు లేని పరిస్థితుల్లో నుంచి ముత్యం రెడ్డి అభివృద్ధి చేశారని చెప్పారు. పల్లెలు పట్నాలు వెళ్లకుండా -పట్నాల నుంచి పల్లెలకు రావాలని కలగన్న నేత ముత్యం రెడ్డి అని అన్నారు. ఐదు మార్కెట్ యార్డ్ లు తెచ్చిన ఘనత ముత్యం రెడ్డికి చెందుతుందని చెప్పారు. ‘30 ఏళ్ళు ప్రజల కోసం ముత్యం రెడ్డి బతికితే టీఆర్ఎస్ ముత్యంరెడ్డికి అవమానం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. నేతలందరూ రాజకీయం వల్ల ఆస్తులు సంపాదిస్తే, ఆస్తులను అమ్మి రాజకీయం చేసిన ఘనత ముత్యం రెడ్డికి చెందుతుంది. రాబోయే ఎన్నికల్లో దుబ్బాక లో కాంగ్రెస్ జెండా ఎగరవేయ్యాలి. ఈ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే అభ్యర్థే. నాపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకుంటా.’ అని చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేరును రేపు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటిస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం లేదన్నారు.

Next Story
Share it