Telugu Gateway
Politics

ఎన్నికలకు ముందు ట్రంప్ కు షాక్..కరోనా పాజిటివ్

ఎన్నికలకు ముందు ట్రంప్ కు  షాక్..కరోనా పాజిటివ్
X

ఎన్నికల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్. తాజాగా అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల డిబేట్ లో డెమాక్రటిక్ అభ్యర్ధి జో బైడెన్ ను ట్రంప్ ఎద్దేవా చేశారు. తాను బైడెన్ లాగా పెద్ద మాస్క్ పెట్టుకోనని..ప్రతి సమావేశంలో బైడెన్ మాస్క్ పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ బారిన పడటం విశేషం. కరోనా నివారణకు మాస్క్ ధరించటం ఉత్తమం అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో)తోపాటు వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నా ట్రంప్ మాత్రం తాను మాస్క్ ధరించనంటూ బహిరంగ ప్రకటనలు చేశారు. అత్యంత కీలక సమయంలో ఆయన కరోనా బారిన పడటంతో ప్రస్తుతం ఇబ్బందిపడాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రంప్ తో పాటు భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియాకు కూడా కరోనా సోకింది. ఈ మేరకు ట్రంప్ శుక్రవారం ట్వీట్ చేశారు.

తాము క్వారంటైన్ ప్రక్రియను ప్రారంభించి తగిన చికిత్స తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ ఉన్నత సలహాదారుగా పనిచేస్తున్న హోప్ హిక్స్ కు కరోనా పాజిటివ్ తాజాగా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే తాను కూడా కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోనున్నట్టు ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే కరోనాకు అత్యంత ఎక్కువగా ప్రభావితమైన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇప్పటివరకు 7.31 మిలియన్ల మంది వైరస్ బారిన పడగా, మరణించిన వారి సంఖ్య 2 లక్షలు దాటేసింది. అమెరికా ఎన్నిల ఫలితాలపై ప్రభావం చూపే ప్రధాన అంశాల్లో కరోనా అత్యంత కీలకంగా మారనుంది. అమెరికా ప్రజలను కరోనా నుంచి రక్షించటంలో ట్రంప్ విఫలమయ్యారని జో బైడెన్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన నిర్ణయాల వల్లే దేశం ఇప్పుడు అనారోగ్యం పాలయ్యిందని విమర్శించారు.

Next Story
Share it