Telugu Gateway
Andhra Pradesh

జగన్ పేరు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కించాలి

జగన్ పేరు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కించాలి
X

వైసీపీ సర్కారుపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. పదహారు నెలల్లోనే 1.28 లక్షల కోట్ల అప్పులు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును గిన్నిస్, లిమ్కా బుక్ ఆప్ రికార్డుల్లోకి ఎక్కించాలని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదాపై ఉద్యమాలు చేసిన వైసీపీ ఇప్పుడు పదహారు నెలలుగా ఆ ఊసే మర్చిపోయిందని విమర్శించారు. జగన్ ఢిల్లీ పర్యటన సంజాయిషీలు ఇఛ్చుకోవటానికి తప్ప..రాష్ట్రానికి పనికివచ్చే పనులు కోసం కాదన్నారు. తన కేసుల భవిష్యత్తే తప్ప రాష్ట్ర భవిష్యత్ జగన్ కు పట్టదన్నారు. యనమల రామకృష్ణుడు గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. ‘కుంభకోణాలపై ఉన్న శ్రద్దలో వందోవంతు కేంద్రనిధులు రాబట్టడంపై వైసిపికి లేదు. కోర్టులో ఉన్న అమరావతి అంశంపై, పదేపదే కేంద్రాన్ని ఒత్తిడి చేయడం గర్హనీయం.

ఇప్పటికి సిఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నిమార్లు ఢిల్లీ వెళ్లారు..?. 16నెలల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం సాధించారు..? కరోనా కన్నా ముందే, మొదటి 10నెలల్లోనే రాష్ట్రాన్ని అధోగతికి దిగజార్చారు. దేశంలోనే టాప్ 3లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను, ఇప్పుడు 21వ స్థానానికి పతనం చేశారు. ఇన్నిమార్లు ఢిల్లీ వెళ్లినా కేంద్ర మంత్రులతో కలిసి ఉమ్మడి ప్రెస్ మీట్ లు ఎందుకని పెట్టలేదు..? తానొక్కడే అయినా ప్రెస్ మీట్ పెట్టి కేంద్రాన్ని ఇది అడిగాం, ఇవి ఇచ్చారని ఎందుకని చెప్పలేక పోయారు..? ఏదో కంటితుడుపుగా సిఎంవో ప్రకటనలే తప్ప జగన్మోహన్ రెడ్డి నోరు తెరవక పోవడంపై పలు అనుమానాలు ఉన్నాయి. తన కేసులపై విచారణ ఎక్కడ వేగవంతం అవుతుందో, ఏడాదిలో ఎంక్వైరీ పూర్తి చేస్తారో అనే భయమే తప్ప రాష్ట్రం గురించి పట్టించుకోక పోవడాన్ని ఖండిస్తున్నాం.’ అని పేర్కొన్నారు.

Next Story
Share it