వైసీపీ సర్కారులో నారాయణకు ‘రక్షణ ఎవరు?’
అతిపెద్ద కుంభకోణదారుడిపై అంత ఉదాసీనత ఎందుకో
వైసీపీ పుస్తకంలో మొదటి ప్లేస్ నారాయణదే
దూకుడు మాత్రం ఎంపిక చేసిన కేసులపైనే
ఏజెండా ప్రకారమే కేసులనే విమర్శలకు ఊతం
తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవాల్సిందే. ఇందులో ఎవరికీ మినహాయింపులు ఉండాల్సిన అవసరం లేదు. సహజంగా ఎవరైనా పెద్ద స్కామ్ చేసిన వారిని ముందు పట్టుకుంటారు. కానీ ఏపీలో వైసీపీ సర్కారు స్కామ్ ల విషయంలో కూడా రివర్స్ మోడ్ లో వెళుతుందా అంటే ...ఔననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసుల విషయంలో కూడా ఓ ‘ఏజెండా’ ప్రకారమే ముందుకు సాగుతుందనే విమర్శలు ఎదుర్కొంటోంది. మాజీ అడ్వకేట్ జనరల్, ఓ న్యాయమూర్తికి సంబంధించిన కుమార్తెలు అమరావతిలో అక్రమంగా భూములు కొన్నారని అందిన ఫిర్యాదుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అనూహ్యంగా హైకోర్టు ఆదేశాలతో ఈ ఎఫ్ఐఆర్ వివరాలు కూడా మీడియాలో కూడా రాకుండా ఆగిపోయాయి. విచారణ కూడా ఆగిపోయింది. దీనిపై ఏపీ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది కూడా. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఉన్న భూమి మొత్తం 50 ఎకరాల లోపే. కానీ వైసీపీ సర్కారు మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత నారాయణ విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉంటోంది. కేవలం ఎంపిక చేసిన అంశాలపైనే కేసులు ఎందుకు పెడుతున్నట్లు?. మంత్రి నారాయణ అమరావతిలో ఏకంగా 432 కోట్ల రూపాయలు వెచ్చించి 3129 ఎకరాలు కొనుగోలు చేశారని వైసీపీ చంద్రబాబుపై ప్రచురించిన ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకంలో పేర్కొంది.
అప్పట్లో ఆ భూముల విలువ 14,400 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. సహజంగా ఏ ప్రభుత్వం అయినా ఎక్కువ స్కామ్ చేసిన వారినే ముందు టార్గెట్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం వ్యవహారం రివర్స్ లో ఉంది. వైసీపీ ప్రచురించిన పుస్తకం ప్రకారం అమరావతిలో అందరి కంటే ఎక్కువ భూమి బినామీలతో కొన్నది నారాయణే అని పుస్తకంలో పేర్కొన్నారు. బినామీలతో భారీ దందా సాగించారని వైసీపీ పేర్కొంది. పక్కా ఆధారాలతో ఏకంగా వైసీపీ స్వయంగా ప్రచురించిన పుస్తకంలో పలు అంశాలను ప్రచురించిన అతి పెద్ద స్కామ్ స్టర్ అయిన నారాయణ విషయంలో ఎందుకు అధికార పార్టీ ఇఫ్పటివరకూ చూసీచూడనట్లు వదిలేస్తోంది. అంటే దీనికి సంబంధించి రకరకాల అంశాలు రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉన్నాయి. కొంత మంది టీడీపీ నేతలు అమరావతి భూ స్కామ్ లో అనుచిత లబ్ది పొందేందుకు ప్రయత్నించిన మాట వాస్తవమే అన్నది బహిరంగ రహస్యం.
అయితే వాటిని న్యాయపరంగా నిరూపించగలుగుతారా? లేదా అన్నది వేచిచూడాల్సిందే. నారాయణ అమరావతిలో భూములు కొనుగోలు విషయంలోనే కాదు..అప్పట్లో సీఆర్ డీఏ కాంట్రాక్టుల కేటాయింపు విషయంలో చక్రం తిప్పారనే విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ నారాయణ విషయాలు ఏమీ వెలుగులోకి రావటం లేదు. ప్రభుత్వం అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశంపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. అయితే అతి పెద్ద అమరావతి స్కామ్ లో విలువ పరంగా...ఎకరాల పరంగా నారాయణదే మొదటి ప్లేస్. ఆధారాలతో పుస్తకం ప్రచురించిన వైసీపీ అసలు నారాయణ గురించి ప్రస్తావించటం లేదు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ తోపాటు నారా లోకేష్ పలువురి బినామీ పేర్లతో భూములు కొన్నట్లు ఎన్నికలకు ముందు విడుదల చేసిన పుస్తకంలో వైసీపీ పలువురి పేర్లను వెల్లడించింది. కానీ చర్యల విషయంలో ‘ఎంపిక చేసుకున్న’ వ్యక్తులపై దూకుడు చూపిస్తున్నట్లు కన్పిస్తోందనే విమర్శలను సర్కారు ఎదుర్కొంటోంది.చేతనైతే అమరావతిలో అవినీతి నిరూపించండి అని సవాళ్లు విసిరిన టీడీపీ నేతలు కేసులు పెట్టగానే కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారు. నిజంగా చంద్రబాబు చెప్పినట్లు తప్పులు ఏమీ చేయనప్పుడు అంతగా ఎందుకు భయపడాలి?.