‘వి’ మూవీ రివ్యూ
ఒకరు పోలీస్ ఆఫీసర్. మరొకరు ఆర్మీలో పనిచేస్తారు. కానీ ఆర్మీలో పనిచేసే విష్ణు(నాని) వరస హత్యలు ఎందుకు చేస్తారు?. సూపర్ కాప్ గా పేరు తెచ్చుకున్న ఆదిత్య( సుధీర్ బాబు) ఈ హత్యలను అడ్డుకోవటంలో విఫలమై ఎందుకు తనకు వచ్చిన మెడల్స్ వదులుకోవటంతో పాటు ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వస్తుంది అన్నదే ‘వి’ మూవీ. వి సినిమా కథ ఇప్పటికే చాలా సినిమాల్లో చూసిందే. అనాథ ఆశ్రమాల్లో ఉన్న అమ్మాయిలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపటం చాలా పాత సబ్జెక్ట్. అయితే సినిమాలో లవ్ ట్రాక్ విషయానికి వస్తే కొద్దిసేపే ఉన్నా నాని, అదితిరావు హైదరీ ల కాంబినేషనే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా లేపాక్షి ఎంపోరియంలో. సుధీర్ బాబు, నివేదా థామస్ ల కాంబినేషన్ బాగానే ఉన్నా...ఎక్కువ మార్కులు నాని కాంబినేషనే పడతాయి. నాని 25వ సినిమా కావటంతో ‘వి’పై ప్రేక్షకుల్లో అంచనాలు చాలానే ఉన్నాయి. దీనికి తోడు ఈ సినిమా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ కావటం ఒకటి. ఎందుకంటే నాని కెరీర్ ప్రారంభించింది ఈ దర్శకుడి సినిమాతోనే అన్న విషయం తెలిసిందే.
గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో నాని నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయటం, ట్రైన్, బస్సు జర్నీలో కామెడీని పండిస్తూ సీరియస్ గా నటించటం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సీరియస్ సన్నివేశాల్లో నాని కామెడీ డైలాగ్ లు ప్రేక్షకులను నవ్విస్తాయి. పోలీసు ఆఫీసర్ పాత్రలో సుధీర్ బాబు తన పాత్రకు న్యాయం చేశారు. సినిమా అంతా ఇద్దరి మధ్య ఛాలెంజింగ్ సన్నివేశాలతోనే సాగుతుంది. నాని తన టార్గెట్ అయిన ఐదు హత్యలకు సంబంధించి క్లూలు ఇచ్చుకుంటూ ముందుకెళ్ళటం..దాన్ని చేధించే పనిలో సుధీర్ బాబు ఉండగానే హత్యలు పూర్తి చేయటం ఆసక్తికరంగా మారుతుంది. కథలో కొత్తదనం లేకపోవటం సినిమాలో మైనస్ గా ఉంది. నాని, సుధీర్ బాబుల నటన మాత్రం ఆకట్టుకుంటుంది. ఈ కరోనా సంక్షోభ సమయంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన పెద్ద సినిమా ఇదే కావటంతో అందరిలో దీనిపై ఆసక్తి నెలకొంది. ఓవరాల్ గా చేస్తే ‘వి’ ఓ సారి చూడదగ్గ సినిమా.
రేటింగ్. 2.5/5