Telugu Gateway
Andhra Pradesh

వివాదం వదిలేయాలన్న పెద్దిరెడ్డి..మరింత పెద్దది చేసిన కొడాలి నాని

వివాదం వదిలేయాలన్న పెద్దిరెడ్డి..మరింత పెద్దది చేసిన కొడాలి నాని
X

ఇందిరాగాంధీని పూరీ ఆలయంలో అడ్డుకున్నారు

సింఘాల్ ను నియమించి చంద్రబాబూ సంప్రదాయాలను ఉల్లంఘించారు

తిరుమలలో ‘డిక్లరేషన్’ గుడి ప్రారంభం నుంచే!

దుమారం రేపుతున్న మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు

సాక్ష్యాత్తూ ఇందిరాగాంధీని కూడా పూరీ జగన్నాథ ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. కారణం ఆమె హిందువే అయినా..పార్శీ వ్యక్తిని పెళ్లాడారని ఆమెకు ఆలయ ప్రవేశానికి అనుమతి లేదని ఆపేశారు. కేవలం హిందువులు మాత్రమే ఆ గుడిలోకి ప్రవేశించాలని బోర్డు తీసుకున్న నిర్ణయమే దీనికి కారణం. అది అక్కడ సంప్రదాయం. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1984లో సోనియాగాంధీని ఖాట్మండులోని పశుపతినాథ్ దేవాలయంలోకి కూడా అనుమతించలేదు. ఇది అప్పట్లో ఇది పెద్ద దుమారమే రేపింది. తాజాగా తిరుమలకు సంబంధించి టీటీటీ ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటన రాష్ట్రంలో పెద్ద దుమారమే రేపింది. తర్వాత ఆయన వివరణ ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని వ్యాఖ్యానించారు. కానీ ఏపీకి చెందిన మరో మంత్రి కొడాలి నాని ఈ వివాదాన్ని మరింత పెద్దది చేశారనే చెప్పాలి. అసలు ఎక్కడా లేని ఈ డిక్లరేషన్ రూల్ తిరుమలలోనే ఎందుకు?. దీనిపై చర్చ జరగాలి అంటూ కొడాలి నాని కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు.

ఈ డిక్లరేషన్ నిబంధన తిరుమల దేవస్థానం ప్రారంభం నుంచి ఉంది..ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ కాదు. ప్రతి రోజూ తెల్లవారు జామున తిరుమల ఆలయం తలుపులు తెరిచేది యాదవులు అన్న సంగతి తెలిసిందే. నిత్యం పూజలు అందించే బ్రాహ్మణులు కాకుండా దేవాలయం తలుపులు యాదవులు మాత్రమే తీస్తారు. కారణం అది దేవాలయం ఏర్పాటు అయినప్పటి నుంచి వస్తున్న సంప్రదాయం, ఆచారం, పద్దతి. అంతే కానీ..ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇవి మారవు. ఒక్కో గుడిలో ఒక్కో పద్దతులు అనుసరిస్తూ ఉంటారు. అంతే కానీ ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు?. ఇది తీసేయాలి అంటే సాధ్యమా?. అవి కోట్లాది మంది భక్తులు నమ్మకాలు..సంప్రదాయాలు, ఆచారాలతో కూడిన అంశాలు. ఎవరి మత విశ్వాసాలను వారు స్వేచ్చగా ఎలా ఆచరించుకోవచ్చో..అలాగే ఏ దేవాలయాల్లో ఉన్న పద్దతులను కూడా అలాగే కొనసాగించాలి. అంతే కానీ ఒకరికి నచ్చలేదని పాతవి తీసేసి..మరొకరికి నచ్చాయని కొత్తవి పెట్టొచ్చా?.

ఇప్పుడు సంప్రదాయాలు, పద్దతుల గురించి మాట్లాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా అధికారంలో ఉండగా చరిత్రలో తొలిసారి ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ ను టీటీడీ ఈవోగా నియమించి కొత్త సంప్రదాయానికి తెరతీశారు. తిరుమల ఆచార వ్యవహారాలు తెలిసి ఉంటాయనే ఉద్దేశంతో అప్పటివరకూ కేవలం తెలుగు ఐఏఏస్ లనే ఈవో పోస్టులో నియమించేవారు. కానీ చంద్రబాబు మాత్రం ఈ నిబంధనను ఉల్లంఘించారు. ఇప్పటికీ చంద్రబాబు నియమించిన అనిల్ కుమార్ సింఘాలే ఈవోగా కొనసాగుతున్నారు. రాజకీయ పోరాటాలు చేసుకోవటానికి పార్టీలకు చాలా అంశాలు ఉంటాయి..కానీ చివరకు ‘దేవుళ్ళ’ను కూడా రాజకీయ పోరాటాల్లోకి లాగుతున్నారు.

Next Story
Share it