Telugu Gateway
Politics

సింగిల్ టూర్..‘డబుల్ ఏజెండా’!

సింగిల్ టూర్..‘డబుల్ ఏజెండా’!
X

కాంగ్రెస్. టీఆర్ఎస్ కలసి ప్రయాణం. టూర్ సింగిల్. ఏజెండా ‘డబుల్’. అందులో ఎవరి ప్రయోజనాలు వాళ్లవి. అసెంబ్లీ వేదికగా సాగిన సవాళ్ళ పర్యవసానంతో గురువారం నాడు హైదరాబాద్ లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల అప్పుడు ప్రకటించారు డబుల్ బెడ్ రూం ఇళ్ళు..ఇంత వరకూ అవి పేదలకు ఎందుకు అందలేదు?. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఈ హడావుడి అంటూ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క బుధవారం నాడు అసెంబ్లీలో ప్రశ్నించారు. దీనికి కౌంటర్ ఇచ్చిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ రెండు లక్షల ఇళ్ళు రెడీగా ఉన్నాయని..కావాలంటే మల్లు భట్టి విక్రమార్కను తీసుకెళ్ళి వాటిని చూపిస్తానని ప్రకటించారు. అన్నట్లుగానే మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ గురువారం ఉదయమే హైదరాబాద్ లోని మల్లు భట్టి విక్రమార్క నివాసానికి చేరుకుని ఆయన్ను తీసుకుని నగరంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ళ పరిశీలనకు వెళ్ళారు. వీళ్లిద్దరూ ఒకే కారులో వెళ్ళటం ఆసక్తికరంగా మారింది. ఇరువురు నేతల వెంట ఆయా పార్టీలకు చెందిన నేతలు కూడా ఉన్నారు. నగరంలో చాలా చోట్ల ఇళ్ళు కట్టడం అయితే ఎప్పుడో కట్టారు కానీ..వాటిని పూర్తి చేసి లబ్దిదారులకు అందించంలో మాత్రం విపరీతమైన జాప్యం జరిగింది. ఇది అంతా రాజకీయంగా..వ్యూహాత్మకంగానే చేస్తున్నారు.

ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండటంతో ఇప్పటికే దాదాపు 80 నుంచి 90 శాతం పూర్తయిన ఇళ్లను ఎన్నికల ముందు పూర్తి చేసి పేదలకు అందించటం ద్వారా రాజకీయంగా లబ్ది పొందేందుకు టీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. కాంగ్రెస్ ఇదే విషయాన్ని ఎత్తిచూపుతోంది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం ప్రకటించి ఇప్పటివరకూ ఎన్ని ఇళ్లు ఇచ్చారో చూపించాలని కోరుతోంది. మరి సింగిల్ టూర్ తో ఎవరిపై ఎవరు పై చేయి సాధిస్తారో వేచిచూడాల్సిందే. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ప్రభుత్వం వ్యూహాత్మకంగా హైదరాబాద్ నగరంపై చర్చ జరిపి..తాము ఏమేమి చేశామో చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఒక్క జంట నగరాలపై దాదాపు 70 వేల కోట్ల రూపాయలపైనే వ్యయం చేసినట్లు మంత్రి కెటీఆర్ తెలిపారు.ఇది అంతా కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం సాగుతున్న వ్యవహారమే.

Next Story
Share it