దేవుళ్లపై అభ్యంతకర వ్యాఖ్యలు.. వైసీపీ మౌనం....మోడీని మాత్రం అలా అనటం తప్పు!
సజ్జల కామెంట్స్ ఇస్తున్న సంకేతం ఏంటి?
ఏపీ మంత్రి కొడాలి నాని గత కొన్ని రోజులుగా దేవుళ్లపై, దేవాలయాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కలకలం సృష్టిస్తున్నారు. ఆంజనేయుడి చెయ్యి విరగ్గొడితే ఏమి అవుతుంది. విగ్రహామే కదా?. రథం కాలిపోతే ..కొత్తది చేయిస్తాం...పది కిలోల వెండిపోతే దాంతో మిద్దెలు కడతారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు..కోట్లాది మంది భక్తులు విశ్వసించే తిరుమల వెంకటేశ్వరస్వామికి సంబంధించిన డిక్లరేషషన్ అంశంపై కూడా నాని వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదం అవుతున్నాయి. రాజకీయంగా ప్రతిపక్ష నేత చంద్రబాబును విమర్శించటం వేరు..కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన దేవాలయాలు..దేవుళ్లపై వ్యాఖ్యలు వేరు. దేవాలయాలు..దేవుళ్లపై మంత్రి కొడాలి నాని ఎన్ని వ్యాఖ్యలు చేసినా వైసీపీ పార్టీపరంగాకానీ...ప్రభుత్వపరంగా ఎవరూ స్పందించలేదు. ఆ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అని చెప్పలేదు. కొడాలి నాని మంత్రి హోదాలో చేసినా..వ్యక్తిగత హోదాలో చేసినా దేవుళ్లు..దేవాలయాలకు సంబంధించిన చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదస్పదం అయ్యాయి.
దీనికి తోడు కొడాలి నాని బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా తిరుమల వెళ్లారు. సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో ఇతర మంత్రులతోపాటు ఆయన కూడా పాల్గొన్నారు. ఇందులో మంత్రి పాల్గొనటాన్ని ఎవరూ ఆక్షేపించాల్సిన అవసరం లేదు. కానీ ఓ వైపు డిక్లరేషన్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసి..దేవుళ్లు..దేవాలయాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నాని సీఎం జగన్ తోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొనటంతో నాని వ్యాఖ్యలకు సీఎం మద్దతు ఉంది అని సంకేతాలు వెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయం వైసీపీ నేతల్లో కూడా వ్యక్తం అవుతోంది.
తిరుమలలో కొడాలి నాని బిజెపితోపాటు ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. వీటికి నిరసనగా బిజెపి గురువారం నాడు ఏపీ అంతటా ధర్నాలు చేపట్టింది. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధాని నరేంద్రమోడీపై మంత్రి నాని చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవి అని ప్రకటించారు. దేశ ప్రధానిపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదని, ఈ విషయంలో కొడాలి నాని కూడా వాస్తవం గ్రహించి ఉంటారని వ్యాఖ్యానించటం విశేషం. మీడియా లో చూశాకే నాని ఏమి మాట్లాడారో తనకు తెలిసిందని అన్నారు. దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినా అసలు నోరుమెదపని వారు మాత్రం మోడీపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు అని చెబుతున్నారు.