Telugu Gateway
Andhra Pradesh

మోడీ బాదుడుకు తోడు ‘జగనన్న సెస్’ అదనం

మోడీ బాదుడుకు తోడు ‘జగనన్న సెస్’ అదనం
X

మద్యం ధరల పెంపులాగా ఇది కూడా ‘రివర్స్’ అవుతుందనే అనుమానం

కరోనా సమయంలో ప్రజలపై పెను భారం

కరోనా కారణంగా అన్ని వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. కొత్త గా ఉపాధి, ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదు. అంతర్జాతీయంగా క్రూడ్ అయిల్ ధరలు ఎన్నడూలేని రీతిలో తగ్గినా కేంద్రంలోని మోడీ సర్కారు వరస పెట్టి పెట్రో ఉత్పత్తులపై పన్నులు పెంచుకుంటూ ధరలు పెంచుతూ పోయింది. నిజానికి అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా తగ్గిన ధరలను వినియోగదారులకు చెందేలా చేయాలి. ఎవరెన్ని విమర్శలు చేసినా కరోనా కష్టకాలంలోనూ కేంద్రం నిత్యం పన్నులు పెంచుకుంటూ ధరలు పెంచుతూ ప్రజల నడ్డివిరిచింది. ఇది చాలదన్నట్లు ఏపీ సర్కారు తాజాగా పెట్రోల్, డీజిల్ పై అదనంగా రూపాయి లెక్కన సెస్ వసూలు చేయటానికి రెడీ అయింది. ఇది ప్రజలపై మోయలేని భారమే. ప్రతిపక్షంలో ఉండగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగినప్పుడు నానాయాగీ చేసిన వైసీపీ ఇఫ్పుడు ఏకంగా ఒకేసారి సెస్ పేరుతో లీటర్ కు రూపాయి చొప్పున సెస్ పెంచటం దారుణం అని రవాణా రంగానికి చెందిన వ్యక్తులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ పెంపు ద్వారా సర్కారుకు 600 కోట్ల రూపాయల మేర అదనపు ఆదాయం వస్తుందని అంచనా. రవాణా రంగం కరోనా కారణంగా కకావికలం అయింది. ఏపీలో మద్యం ధరలు అసాధారణంగా పెంచటం వల్ల రాష్ట్రంలోకి అక్రమ మద్యం ఎలా ఏరులై పారుతుందో..సర్కారు తాజాగా పెట్రోల్, డీజిల్ కు సంబంధించి లీటర్ పై ఏకంగా రూపాయి సెస్ పెంచటం వల్ల కూడా ఈ ఆదాయం తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. లారీలు, బస్సులు, ఇతర పెద్ద వాహనాలు పెంచిన సెస్ కారణంగా మార్గమధ్యంలో లేదా...సరిహద్దు జిల్లాల్లోనే డీజిల్ పోయించుకునే ఛాన్స్ ఉందని..దీని వల్ల అదనపు ఆదాయం సంగతి ఏమో కానీ..ప్రస్తుతం వచ్చే ఆదాయంలోకోత పడటం ఖాయం అని రవాణా రంగానికి చెందిన వ్యక్తులు అభిప్రాయపడుతున్నారు. అసలే వ్యాపారాలు లేక నానా అగచాట్లు పడుతున్న ఈ తరుణంలో ఏకంగా లీటర్ పై రూపాయి సెస్ అనేది చాలా దారుణం అని చెబుతున్నారు.

ద్విచక్ర వాహనదారులు, ఆటోలకు ఎలాగూ తిప్పలు తప్పవు. వీళ్లు డీజిల్, పెట్రోల్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే ఛాన్స్ ఉండదు. కానీ బస్సులు, లారీలు, ఇతర వాహనాలు మాత్రం ఈ పెరిగిన భారం నుంచి తప్పించుకునేందుకు సరిహద్దులకు వెళ్లిన సమయంలోనే ఫుల్ ట్యాంక్ చేయించుకుంటాయని..అంతిమంగా ఇది నష్టం చేస్తుందని చెబుతున్నారు. మామూలు రోజుల్లోనే ఎవరికి వారు ఆదా చేసుకునే ప్రయత్నాలు చేస్తారు కానీ..అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ఎవరు ప్రభుత్వ ఖజానా నింపాలని పెరిగిన రేట్లతో డీజిల్, పెట్రోల్ పోయించుకుంటారని ఓ ట్రావెల్ యాజమాని వ్యాఖ్యానించారు.

Next Story
Share it