రకుల్..సారాల పేర్లు చెప్పింది నిజమే
దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, ఫ్యాషన్ డిజైనర్ సిమోనో ఖంబట్టా లు పేర్లు వచ్చిన మాట నిజమే అని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) స్పష్టం చేసింది. రియా చక్రవర్తిని ప్రశ్నిస్తున్న సమయంలో ఆమె వీరి పేర్లు వెల్లడించినట్లు ఎన్ సీబీ అధికారులు సోమవారం ధృవీకరించారు. అయితే రియా వెల్లడించిన ముగ్గురికి ఇప్పటివరకూ ఎలాంటి సమన్లు జారీ చేయలేదని తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు వ్యవహారంలో డ్రగ్స్ లింక్ లు తేలటంతో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. తొలుత వీరి పేర్లతో జాతీయ ఛానల్ కథనాన్ని ప్రస్తారం చేయటం..తర్వాత వీరి పేర్లు లేవని..ఎన్ సీబీ అధికారులు చెప్పారంటూ వార్తలు రావటంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. ఈ కథనాన్ని ప్రస్తారం చేసిన ఛానల్ ను కూడా టార్గెట్ చేస్తూ చాలా మంది ట్వీట్లు చేశారు.
అయితే ఎన్ సీబీ మాత్రం ఈ సారి అధికారికంగా వీరి పేర్లను ధృవీకరించింది. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోయిన్ సమంత కూడా క్షమించు సారా..రకుల్ అంటూ ఆదివారం నాడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ ఎన్ సీబీ మాత్రం ఇప్పుడు అసలు విషయాన్ని తేల్చేసింది. మరి ఇఫ్పుడు సమంతా ఏమి చెబుతుందో వేచిచూడాల్సిందే. సినీ పరిశ్రమల్లోని కీలక వ్యక్తులు డ్రగ్స్ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నట్లు తేలటంతో విచారణపై కూడా పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మరి ఈ కేసు దర్యాప్తు ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.