Telugu Gateway
Cinema

డ్రగ్స్ కొనుగోలులో రియా పాత్ర స్పష్టం

డ్రగ్స్ కొనుగోలులో రియా పాత్ర స్పష్టం
X

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి బెయిల్ పిటీషన్ ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) తీవ్రంగా వ్యతిరేకించింది. డ్రగ్ డీలర్స్ తో రియా చక్రవర్తికి సంబంధాలు ఉన్నాయని..ఆమె వారికి చెల్లింపులు జరిపినట్లు స్పష్టమైన ఆధారాలు దొరికాయని ఎన్ సీబీ పేర్కొంది. రియా తన ఇంట్లో డ్రగ్స్ నిల్వ చేసి..దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు అందజేసిందని తెలిపారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి, షోవిక్ ల బెయిల్ పిటీషన్ లపై మంగళవారం నాడు ముంబయ్ కోర్టులో విచారణ జరిగింది. ఎన్ సీబీ ఈ సమయంలో వీరి బెయిల్ పిటీషన్లను వ్యతిరేకిస్తూ పలు ఆధారాలతో అఫిడవిట్ సమర్పించింది. రియా చక్రవర్తి తీవ్రమైన నేరాలకు పాల్పడిందని..ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు.

ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. డ్రగ్స్ అక్రమ రవాణాకు ఆర్ధిక సాయం చేసినందుకు, నేరస్థులను ఆశ్రయించినందుకు ఆమె శిక్షార్హురాలు అని పేర్కొన్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో విచారణ అంతా బాలీవుడ్ డ్రగ్స్ చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. రియా చక్రవర్తితోపాటు బాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోయిన్లు దీపికా పడుకొణె, శ్రద్ధా దాస్, సారా అలీఖాన్, టాలీవుడ్ కు చెందిన రకుల్ ప్రీత్ సింగ్ ను కూడా ఎన్ సీబీ విచారించిన విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో మరికొంత మందిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు.

Next Story
Share it