Telugu Gateway
Cinema

డ్రగ్స్ వాడకం కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు!

డ్రగ్స్ వాడకం కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు!
X

ప్రస్తుతం బాలీవుడ్, శాండల్ వుడ్ కే పరిమితం అయిన డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ వైపు కూడా రానుందా?. తాజాగా వెల్లడైన పేర్లలో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు రావటంతో ఈ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన విషయం తెలిసిందే. ప్రముఖ ఆంగ్ల ఛానల్ టైమ్స్ నౌ రకుల్ ప్రీత్ సింగ్ తోపాటు సారా అలీఖాన్, సిమోనో కంబట్టా పేర్లను కూడా రియా చక్రవర్తి వెల్లడించినట్లు టైమ్స్ నౌ కథనం పేర్కొంది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో కూడా కలకలం మొదలయ్యే ఛాన్స్ కన్పిస్తోంది. గతంలో టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు వచ్చినా కూడా ఈ కేసు పూర్తిగా నీరుకారిపోయింది. టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు వెలుగుచూసినప్పుడు సర్కారు మాత్రం అసలు ఎవరినీ వదిలిపెట్టే ప్రశ్నేలేదని ప్రకటించింది. కానీ ఒక్కరిని కూడా ఇప్పటివరకూ పట్టుకున్న దాఖలాలు లేవు. ఆ కేసు ఏ దశలో ఉందో..అసలు ఏమైందో ఎవరికీ తెలియదు.

నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) కి రియా చక్రవర్తి ఇచ్చిన ఇరవై పేజీల స్టేట్ మెంట్ లో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, సిమోనో కంబట్టా పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. ఈ జాబితా ఆధారంగా ఎన్ సీబీ త్వరలోనే ఇందులో పేర్లు ఉన్న నటీ, నటులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఎన్ సీబీ అధికారులు తనతో బలవంతంగా స్టేట్ మెంట్ తీసుకున్నారని రియా చక్రవర్తి బెయిల్ పిటీషన్ కోసం చేసిన దరఖాస్తులు పేర్కొంది. అయితే ముంబయ్ స్పెషల్ కోర్టు మాత్రం రియా చక్రవర్తితో పాటు ఇతరుల బెయిల్ పిటీషన్స్ ను తోసిపుచ్చింది. అయితే ఈ సారి అయినా డ్రగ్స్ కేసు ఓ కొలిక్కి వస్తుందా? లేక టాలీవుడ్ డ్రగ్స్ కేసులాగానే మరుగునపడిపోతుందా? అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it