Telugu Gateway
Politics

తిరుమల వివాదంలో కొత్త ట్విస్ట్..దంపతులు పట్టు వస్త్రాలు ఇవ్వాలి

తిరుమల వివాదంలో కొత్త ట్విస్ట్..దంపతులు పట్టు వస్త్రాలు ఇవ్వాలి
X

తిరుమల డిక్లరేషన్ వ్యవహారం మంగళవారం నాడు కొత్త ట్విస్ట్ తీసుకుంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం దీనికి కారణమైంది. సీఎం జగన్ తిరుమల సందర్శన సందర్భంగా డిక్లరేషన్ ఇవ్వటంతోపాటు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు ఇవ్వాలని..అదే రాష్ట్రానికి మంచిది అని వ్యాఖ్యానించింది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఈ డిమాండ్ ను లేవనెత్తారు. జగన్ ఒక వేళ డిక్లరేషన్ ఇవ్వకపోతే...శ్రీవారికి పట్టు వస్త్రాలు వేరే వారికి ఇచ్చి పంపాలన్నారు. ‘కొడాలి నాని ఒక మూర్ఖుడు. మూర్ఖులతో ఎంత వాదించినా సమయం వృధా. 16 నెలల్లో అమరావతి భూములపై వేసిన సబ్ కమిటీ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేదు. 16 నెలల్లో ఏపీ ప్రభుత్వం ఏమి చేసిందో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ము ఉందా? నెలకు 3లక్షలు జీతం తీసుకుంటున్న సజ్జల ప్రభుత్వానికి ఏమైనా పనికి వచ్చే ఒక సలహా ఇచ్చారా? గత ప్రభుత్వంలో 6లక్షల కోట్ల అవినీతి అని ఢిల్లీ నుండి గల్లీ వరకు తిరిగి ఏమి తేల్చారు?

అమరావతి లో భూములు కొనకోడదు అని చట్టంలో ఏమైనా ఉందా?. పదే పదే అమరావతి లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. చట్టంలో అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే పదం లేదు. 75వేల ఎకరాల భూమి విశాఖలో వన్ సైడ్ ట్రేడింగ్ జరిగింది. అమరావతి భూములపై... విశాఖలో జరిగిన వన్ సైడ్ ట్రేడింగ్ పై దమ్ము ఉంటే సీబీఐ విచారణ జరపాలి. అమరావతి లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదు అని కేబినెట్ సబ్ కమిటితేల్చింది..అందుకే ఇప్పుడు సీబీఐ విచారణ అంటున్నారు. మంత్రి జయరాం పై సమగ్ర దర్యాప్తు జరిపి భర్తరఫ్ చేయాలి. 16 నెలల్లో వైసీపీ అంతులేని అవినీతి చేసింది. ’ అని బొండా ఉమా వ్యాఖ్యానించారు.

Next Story
Share it