Telugu Gateway
Andhra Pradesh

కేసులు పెడతానన్నారు..క్యాన్సిల్ చేశారు

కేసులు పెడతానన్నారు..క్యాన్సిల్ చేశారు
X

ఏపీలో న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ (ఎన్ డీబీ) నిధులతో చేపట్టే రోడ్డు పనులకు సంబంధించి అన్ని పనులకు రెండంటే రెండు కంపెనీలే బిడ్లు వేశాయని..చాలా పరిమిత సంఖ్యలోనే కంపెనీలు పాల్గొన్నాయనే విమర్శలు వచ్చాయి. ఇందులో ఓ మంత్రితోపాటు కొంత మంది ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే శుక్రవారం నాడు కూడా రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఈ టెండర్లపై వార్తలు రాసిన పత్రికలకు పరువు నష్టం దావా నోటీసులు ఇస్తున్నామని ప్రకటించారు. టెండర్ల ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగిందని..టెండర్లు జ్యుడిషియల్ ప్రివ్యూకు వెళ్లి కూడా అనుమతి పొంది వచ్చాయన్నారు. టెండర్లపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదున్నారు, శుక్రవారం వరకూ అంతా సవ్యంగానే ఉందని..మీడియాకు హెచ్చరికలు జారీ చేశారు. సీన్ కట్ చేస్తే మాత్రం శనివారం నాడు మాత్రం ‘ప్రస్తుత‌ టెండర్లను రద్దు చేసి మళ్ళీ టెండర్లకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

అర్హత విషయంలో చాలా కంపెనీలు ఉన్నా, 14 కంపెనీలే టెండరు వేయడానికి కారణం తెలుసుకుంటాం. ఉన్న టెండర్లకు చాలా తక్కువ స్పందన వచ్చినందున రీటెండరింగ్‌కు వెళుతున్నాం. ప్రపంచ బ్యాంకు నియమాల ప్రకారం గత రెండు సంవత్సరాలలో ఒక కంపెనీ వంద కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలి. కాంట్రాక్టరు త్వరితగతిన కాంట్రాక్టు పూర్తిచేసే సామర్ధ్యం కలిగి ఉండాలి. ఎక్కువమంది టెండరులో పాల్గొనేలా చేస్తే, రాష్ట్రంలో మరింత ఎక్కువ కిలోమీటర్లు అభివృద్ధి చేసే అవకాశం ఉంది. జ్యుడీషియల్ ప్రివ్యూ కమీషన్, రివర్స్ బిడ్డింగ్ కూడా పారదర్శకత కోసమే. ’ అని తెలిపారు. అంతా సవ్యంగానే ఉన్నప్పుడు ..ఎవరి దగ్గర నుంచి ఫిర్యాదులు రానప్పుడు, వార్తలు రాసిన మీడియాను హెచ్చరించిన కృష్ణబాబు ఇప్పుడు పనులను క్యాన్సిల్ చేస్తున్నామని ప్రకటించటం ద్వారా ఇంత కాలం మీడియాలో వచ్చింది నిజం అని అంగీకరించినట్లు అయిందని ఆర్అండ్ బి శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Next Story
Share it