Telugu Gateway
Andhra Pradesh

మోడీ, అమిత్ షా..సోము వీర్రాజులపై నాని సంచలన వ్యాఖ్యలు

మోడీ, అమిత్ షా..సోము వీర్రాజులపై నాని సంచలన వ్యాఖ్యలు
X

ఏపీ మంత్రి కొడాలి నాని బిజెపి నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డిక్లరేషన్ కు సంబందించి గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని..డిక్లరేషన్ పై చర్చ జరగాలన్నారు. సీఎం జగన్ దంపతులు వచ్చి వెంకటేశ్వరస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించాలన్న బిజెపి నేతల వ్యాఖ్యలపై నాని మండిపడ్డారు. ప్రధాని మోడీ అయోధ్యలో ఒక్కరే పూజలు చేశారా?. భార్యతో వెళ్లి పూజలు చేశారా? అని ప్రశ్నించారు. ఏపీలో సోము వీర్రాజు బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాకే రాష్ట్రంలో దేవాలయాల్లో దాడులు పెరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బర్తరఫ్ చేయాలన్న బీజేపీ డిమాండ్‍పై నాని స్పందించారు. పదిమందిని వెంటబెట్టుకుని కేంద్రమంత్రి అమిత్‍షాను తొలగించాలంటే తొలగిస్తారా? అని ప్రశ్నించారు. ఎవరి పార్టీ వ్యవహారాలు వాళ్లు చూసుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని, అత్యధిక ఓట్లు వచ్చిన సీఎం జగన్‍కు సలహాలు ఇచ్చే స్థాయి బీజేపీకి ఉందా? అని మంత్రి ప్రశ్నించారు.

ప్రధాని మోదీ, యూపీ సీఎం మాత్రం ఒంటరిగా ఆలయాలకు వెళ్తారు.. జగన్ మాత్రం కుటుంబసమేతంగా ఆలయానికి రావాలా అని నిలదీశారు. మోదీ తన భార్యను తీసుకెళ్లి రామాలయంలో పూజలు చేయమనండని కొడాలి నాని చెప్పారు. ‘‘బీజేపీ నేతలు ప్రధాని మోదీని బజారున పడేస్తున్నారు. ముందు ప్రధాని మోదీని సతీసమేతంగా ఆలయానికి రమ్మని చెప్పండి. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు టీటీడీనే సీఎంను ఆహ్వానిస్తే డిక్లరేషన్ ఎందుకు సమర్పించాలి? స్వామివారిపై నమ్మకంతోనే భక్తులు తిరుమలకు వస్తారు. సీఎం జగన్‌కీ కులాలు.. మతాలతో సంబంధం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీవారిని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు.’ అని విమర్శించారు.

Next Story
Share it