చరిత్రలో ఇలాంటి ఘటనలు చూడలేదు..కేంద్రంపై కేశవరావు ఫైర్
బలం లేకపోయినా బిల్లులు ఆమోదించుకున్నారు
కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు రాజ్యసభలో జరిగిన పరిణామాలు దారుణం అని..తన జీవితంలో చట్టసభల్లో ఇలాంటి ఘటనలు చూడలేదన్నారు. బలం లేని రాజ్యసభలో కూడా బిల్లులు ఆమోదింపచేసుకున్నారని విమర్శించారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కేంద్రం తెచ్చిన బిల్లులు ఏ మాత్రం ఉపయోగపడవన్నారు. ఈ బిల్లుల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర పెరుగుతుందని బిజెపి చెప్పగలదా? అని కేశవరావు ప్రశ్నించారు. రాజ్యసభలో జరిగిన పరిణామాల అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పూర్తి పక్షపాతంతో వ్యవహరించారని ఆరోపించారు.
తన అరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇలా నిబంధనలకు వ్యతిరేకంగా బిల్లుల ఆమోదం ఎప్పుడూ జరగలేదన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేయాలని బిజెపి చూస్తోందని ఆరోపించారు. డిప్యూటీ ఛైర్మన్ వ్యవహరించిన తీరుకు నిరసనగానే ఆయనపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. పన్నెండు పార్టీల మద్దతుతో 50 మంది ఎంపీల సంతకాలతో ఈ తీర్మానం నోటీసులు ఇచ్చామన్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసులు పెండింగ్ లో ఉండగా డిప్యూటీ ఛైర్మన్ సభాధ్యక్షుడి హోదాలో కొనసాగే అవకాశం లేదని కేశవరావు వివరించారు.