Telugu Gateway
Politics

ఎక్కడైనా ప్రభుత్వాలను ప్రశ్నిస్తేనే ‘అక్రమాలు’ గుర్తొస్తాయి!

ఎక్కడైనా ప్రభుత్వాలను ప్రశ్నిస్తేనే ‘అక్రమాలు’ గుర్తొస్తాయి!
X

అది కేంద్ర ప్రభుత్వం కావొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కావొచ్చు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తేనే అక్రమాలు..అక్రమ నిర్మాణాలు గుర్తొస్తాయి. ఎవరు ఎవరినీ ప్రశ్నించకుండా..ప్రభుత్వాలకు మద్దతు ఇస్తూ పోతే అక్రమాలు చేసినా ఏమీకాదు..అక్రమ నిర్మాణాలు కట్టినా ఏమీ కాదు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కార్యాలయం కూల్చివేత విషయం ఇదే విషయాన్ని మరోసారి నిరూపించింది. కంగనా రనౌత్ కార్యాలయం అక్రమం అనే విషయం ఇప్పుడు మాత్రమే బృహన్ ముంబయ్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) గుర్తించిందా?. గతంలో ఈ నిర్మాణంలో డీవియేషన్లు ఉన్నాయనే విషయం బీఎంసీకి తెలియదా?. ఎప్పుడైతే కంగనా రనౌత్ మహారాష్ట్రలో శివసేన సంకీర్ణ ప్రభుత్వంపై బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి సంబంధించిన అంశంపై ఎటాక్ ప్రారంభించటం, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఆమెకు మధ్య మాటల యుద్ధం ముదరటంతోనే అక్రమ నిర్మాణాలు..డ్రగ్స్ వాడకం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. లేదంటే అంతా గప్ చుప్. ప్రశ్నించనంత కాలం కంగనా రనౌత్ ఎన్ని అక్రమ నిర్మాణాలు కట్టినా ఎవరూ పట్టించుకోరన్న మాట.

ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాత్రం ఆమెకు సంబంధించిన ‘అక్రమాల’పై అప్పటికప్పుడు తవ్వకాలు మొదలుపెడతారు. అటు కేంద్రంలోని బిజెపి సర్కారుకు..ఇటు మహారాష్ట్రలోని శివసేన సర్కారుకు పెద్ద తేడా ఏమీలేదనే విషయాన్ని ఈ విషయం రుజువు చేసింది. ఎదురుతిరిగితే..ప్రశ్నిస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయనే సంకేతాలు ప్రభుత్వాలు పంపుతూనే ఉన్నాయి. ముంబయ్ నగరంపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఆక్షేఫణీయమే. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల అనంతరం మహారాష్ట్ర సర్కారు వ్యవహరించిన తీరు మాత్రం తీవ్ర విమర్శల పాలు అవుతోంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ముంబయ్ కు రావొద్దనే తరహాలో కంగనాకు హెచ్చరికలు జారీ చేశారో లేదో...కేంద్రం తక్షణమే స్పందించి ఆమెకు వై కేటగిరి భద్రత కల్పించింది. దీనికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కంగనా వెంటనే కృతజ్ణతలు కూడా తెలిపారు. కంగనా రనౌత్ వెనక బిజెపి ఉందనే అనుమానాలను శివసేన వ్యక్తం చేస్తోంది. కేంద్రం నిర్ణయాలు కూడా ఈ అనుమానాలను మరింత బలోపేతం చేసేవిలాగానే ఉన్నాయి. ముంబయ్ లో ఒక్క కంగనా రనౌత్ ఆఫీసు తప్ప..మిగతా ఇళ్లు, ఆఫీసులు అన్నీ సక్రమ నిర్మాణాలేనా?. అంటే ప్రభుత్వాన్ని..ప్రభుత్వంలోని నేతలను ప్రశ్నించవరకూ అంతే.

Next Story
Share it