మెట్రో ఎక్కాలంటే మాస్క్ తప్పనిసరి..సర్వీసులు రాత్రి 9 వరకే

హైదరాబాద్ లో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. దశల వారీగా ఈ సర్వీసులు ప్రారంభించనున్నారు. అయితే మెట్రో సర్వీసుల ప్రారంభానికి సంబంధించి పలు మార్గదర్శకాలు జారీ చేశారు. కంటైన్ మెంట్ జోన్లు ఉన్న ప్రాంతాల్లో మెట్రో రైళ్ళు ఆగవు. ఏ మాత్రం కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే రైళ్ళలోకి అనుమతిస్తారు. రాత్రి తొమ్మిది గంటల వరకే సర్వీసులు నడవనున్నాయి. సెప్టెంబర్ 7 న కారిడార్ 1లో (మియాపూర్ నుంచి ఎల్బీ నగర్) సేవలు అందుబాటులోకి వస్తాయి. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతాయి. ఇక రెండో దశ మెట్రో సేవలు సెప్టెంబర్ 8 నుంచి అందుబాటులోకి వస్తాయి. దానిలో భాగంగా కారిడార్ 3లో (నాగోల్ నుంచి రాయదుర్గ్) మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. రెవెన్యూ సేవలు మొదటి దశ మాదిరిగానే ఉంటాయి.
ఇక మూడవ దశ మెట్రో సేవలు సెప్టెంబర్ 9 నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీనిలో భాగంగా మూడు కారిడార్లలో(సీ1, సీ2, సీ3) మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి ఐదు నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉండనుంది. రైళ్ల సంఖ్యను పెంచడం అనేది ప్రయాణీకుల రద్దీ ఆధారంగా నిర్ణయించబడుతుంది. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్, భరత్ నగర్, మూసాపేట, ముషీరాబాద్, యూసఫ్‌గూడ స్టేషన్లు మూసివేత కొనసాగుతుంది. మైట్రో రైలులో సోషల్ డిస్టెన్సింగ్ ను కూడా సీసీటీవీల ద్వారా పర్యవేక్షించనున్నారు. సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు లిఫ్ట్ లు...స్టేషన్లు,టాయిలెట్లను ఎప్పటికప్పుడు డిస్ ఇన్ ఫెక్ట్ చేయనున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం మెట్రో ప్రయాణికుల కోసం పార్కింగ్ ప్రాంతాలను కూడా ఓపెన్ చేయనున్నారు. నగదు రహిత లావాదేవీలకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు.