నవంబర్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు
తెలంగాణ సర్కారు కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా హైదరాబాద్ లో చాలా పెండింగ్ పనులు పూర్తి చేసింది. కొత్తగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇది అంతా జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్ గా ముందస్తు వ్యూహంతో సాగింది. అందులో భాగంగా ఇప్పుడు నగరంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళ పనులుకూడా స్పీడ్ అందుకున్నాయి. అయితే ఇవి ఎన్నికల నాటికి లబ్దిదారులకు అందుతాయా లేదా అన్నది వేచిచూడాల్సిందే. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ మున్సిపల్, పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ రెండవ వారం తర్వాత ఎప్పుడైనా జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. 15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగాలేదని సర్వేల్లో తేలిందని..ఇప్పటికైనా వారు పనితీరు మార్చుకోవాలన్నారు. కార్పొరేటర్లకు ఏమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురావాలని కెటీఆర్ సూచించారు. గత ఐదు ఏళ్లుగా హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని కేటీఆర్ తెలిపారు.
ఆయన మంగళవారం నాడు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, నగర మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కెటీఆర్ మాట్లాడుతూ.. జిహెచ్ఎంసీ పరిధిలో ఇన్ని రోజులుగా చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత పెద్ద ఎత్తున తీసుకుపోవాలని కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ధరణి పోర్టల్’లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రజల్లోకి మరింత సమాచారాన్ని తీసుకుపోవాలని తెలిపారు. హైదరాబాద్ నగరంలో అనేక కారణాలతో కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు ప్రజల ఆస్తులపైన సంపూర్ణ హక్కులు లేకుండా కొన్ని సమస్యలు ఉన్నాయని తెలిపారు. వాటన్నింటినీ సానుకూలంగా పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. ఇలాంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తీసుకువచ్చారని గుర్తుచేశారు. స్థిరాస్తులపైన యాజమాన్య హక్కులు కల్పించేందుకు చేపట్టే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 1వతేదీ నుంచి ప్రారంభం కానున్న ఓటరు నమోదు కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని మరింతగా పెంచేందుకు నగరంలో ఉన్న గ్రాడ్యుయేట్లలను ఓటర్లుగా నమోదు చేయించేందుకు ప్రయత్నం చేయాలని చెప్పారు. అక్టోబర్ 1వ తేదీన ప్రతీ ఒక్కరు తమతో పాటు తమ కుటుంబ సభ్యులను ఓటర్లుగా నమోదు చేయించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.