ఏపీకి ఫస్ట్ ..తెలంగాణకు మూడవ ర్యాంక్

సులభతర వాణిజ్య విభాగం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం దక్కించుకుంది. రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉండగా...తెలంగాణ మూడవ స్థానంలో నిలిచింది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు ఈ జాబితాను విడుదల చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత సులభంగా ఎక్కడైతే అనుమతులు లభిస్తాయో వాటి ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయిస్తారు. పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు లేకుండా త్వరతగతిన అనుమతులు ఇచ్చేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర భారత్ ను అమలు చేయటంలోనూ ఏపీనే ముందు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.
పెట్టుబడులను ఆకర్షించటంలో ఆరోగ్యకర పోటీలో ఈ మూడు రాష్ట్రాలు ముందు ఉన్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో 20 లక్షల కోట్ల పారిశ్రామకోత్పత్తే లక్ష్యం అని పేర్కొన్నారు. ఇది దేశంలో కొత్తగా ఉపాధి కల్పనకు, ఆర్ధిక కార్యకలాపాలు ఊపందుకునేందుకు దోహదపడగలదని పేర్కొన్నారు. తొలి మూడు స్థానంలో నిలిచిన రాష్ట్రాలకు నిర్మల అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్ ఈ జాబితాలో పదవ స్థానంలో నిలవటం విశేషం.