Telugu Gateway
Politics

దుబ్బాక ఉప ఎన్నిక నవంబర్ 3న

దుబ్బాక ఉప ఎన్నిక నవంబర్ 3న
X

తెలంగాణ లో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధం అయింది. నవంబర్ 3న దుబ్బాక అసెంబ్లీకి ఎన్నిక జరగనుంది. ఫలితాలు నవంబర్ 10న వెల్లడికానున్నాయి. టీఆర్ఎస్ కు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించటంతో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు సంబంధించి అక్టోబర్ 9న నోటిఫికేషన్ జారీ కానుంది. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు అక్టోబర్ 16గా నిర్ణయించారు. ఈ సీటును నిలబెట్టుకునేందుకు అధికార టీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే టిక్కెట్ సోలిపేట కుటుంబ సభ్యులకు ఇస్తారా? లేక దివంగత ముత్యంరెడ్డి తనయుడికి ఇస్తారా అన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. మంత్రి హరీష్ రావు గత కొంత కాలంగా నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి కార్యక్రమాలు చేపట్టారు.

సీటు విషయంలో మాత్రం టీఆర్ఎస్ నేతల మధ్య వివాదాలు ఉన్నాయి. అయితే అధిష్టానం ఎవరి పేరు ఖరారు చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. బిజెపి కూడా దుబ్బాక సీటుపై సీరియస్ గానే దృష్టి పెట్టింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత రఘునందన్ రావు గత కొంత కాలంగా ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ప్రధానంగా పోటీ టీఆర్ఎస్, బిజెపిల మధ్యే ఉండే అవకాశం కన్పిస్తోంది. కాంగ్రెస్ కూడా తాము బరిలో ఉంటామని చెబుతున్నా...ఆ పార్టీ ప్రభావం అంతంతమాత్రమే అనే అంచనాలు వెలువడుతున్నాయి.

Next Story
Share it