Telugu Gateway
Politics

జగన్ తో డీకె శ్రీనివాసులు భేటీ

జగన్ తో డీకె  శ్రీనివాసులు భేటీ
X

ఏపీలో టీడీపీని ఖాళీ చేసే పనిలో పడింది వైసీపీ. వరస పెట్టి టీడీపీ నేతలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమారులు వైసీపీలో చేరగా..ఎమ్మెల్యే వైసీపీకి బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. జగన్ పేదలకు మేలు చేస్తున్నారని..అందుకే మద్దతు అని తెలిపారు కూడా. గురువారం నాడు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడు తనయుడు డీకే శ్రీనివాసులు త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోనున్నారని చెబుతున్నారు. సీఎం జగన్ తిరుమల పర్యటనలో ఉండగా శ్రీనివాసులు సీఎంను కలిశారు. ఎంపీ మిథున్‌రెడ్డి.. డీకే శ్రీనివాస్‌ను జగన్‌కు పరిచయం చేశారు. జగన్‌తో 10 నిమిషాల పాటు డీకే శ్రీనివాసులు సమావేశమయ్యారు.

గత ఎన్నికల్లో మిథున్‌రెడ్డిపై రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున డీకే శ్రీనివాస్‌ తల్లి సత్యప్రభ పోటీ చేశారు. జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీనివాసులు.. ఆనంద నిలయం అనంతస్వర్ణమయం ప్రాజెక్ట్‌ ను పూర్తి చెయ్యాలనేది నాన్న ఆదికేశువులు చివరి కోరిక అన్నారు. ఆ ప్రాజెక్ట్ రాజకీయ కారణాలతో నిలిచిపోయిందన్నారు. ఈ ప్రాజెక్ట్‌ ను పూర్తి చెయ్యాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. సీఎం నుంచి సానుకూల స్పందన లభించిందన్నారు. పార్టీ మార్పు విషయంపై ప్రస్తుతం చర్చించలేదన్నారు. ప్రాజెక్ట్ పూర్తి చెయ్యడమే లక్ష్యమని... రాజకీయ భవిష్యత్ గురించి తరువాత మాట్లాడుతానని డీకే శ్రీనివాస్ తెలిపారు.

Next Story
Share it