Telugu Gateway
Politics

మూడు దశల్లో బీహార్ ఎన్నికలు

మూడు దశల్లో బీహార్ ఎన్నికలు
X

బీహార్ అసెంబ్లీ ఎన్నికల గంట మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించింది. మూడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 28న తొలివిడత పోలింగ్‌, నవంబర్ 3న రెండో విడత , మూడో విడత నవంబర్ 7న జరగనుంది. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు చేపట్టి తుది ఫలితాలను ప్రకటించనున్నారు. శుక్రవారం ఢిల్లీలోని నిర్వచన్‌ సదన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీఈసీ సునీల్‌ అరోరా ఈ వివరాలను వెల్లడించారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్‌ 29తో ముగియనుంది. దేశంలో కరోనా విజృంభణ అనంతరం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఈసీ ప్రత్యేక మార్గదర్శకాల నడుమ ఎన్నికలు నిర్వహిస్తోంది.

బహిరంగ సభలు, ర్యాలీలకు ఈసీ అనుమతి నిరాకరించింది. నామినేషన్ల ప్రక్రియను ఆన్‌లైన్‌లోనూ నమోదు చేసుకునే అవకాశాన్ని సైతం కల్పించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల వద్ద శానిటైజర్లను సైతం అందుబాటులో ఉంచుతున్నట్లు అరోరా తెలిపారు. 80 ఏళ్లు పైబడిన వారికే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని 15 రాష్ట్రాల్లో 64 స్థానాలకు ఉప ఎన్నికలకు సైతం షెడ్యూల్‌ను ప్రకటించింది.

Next Story
Share it