రాష్ట్రంలో మతకల్లోలాలకు చంద్రబాబు కుట్ర
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి చంద్రబాబు లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అజెండాను చంద్రబాబు ఫాలో అవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించాలని ఆయన ఆరాట పడుతున్నారని మండిపడ్డారు. దేవాలయాలపై దాడులు, దొంగతనాలు వెనుక ఎవరున్నా పట్టుకుని శిక్షిస్తామని చెప్పారు. తప్పు చేసినవారు శిక్ష అనుభవించక తప్పదని మంత్రి హెచ్చరించారు. సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం ఎలా స్పందించిందనేది ముఖ్యమని చెప్పారు. ‘నాకు మాత్రం ఈ దాడుల వెనుక టీడీపీ ఉంది అనిపిస్తోంది. డీజీపీని కూడా ఆ కోణంలో విచారించాలని కోరాం. టీడీపీ హయాంలో పంచభూతాలను పంచుకుతిన్నారు.
తప్పు చేయకపోతే కోర్టుకు వెళ్లి స్టేలు ఎందుకు తెచ్చుకున్నారు’ అని మంత్రి ప్రశ్నించారు. బొత్స సత్యనారాయణ పార్టీ కార్యాలయంలో మంత్రి శనివారం మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ తిరుమలలో ఎంతో దైవభక్తితో ఉన్నారని పేర్కొన్నారు. కావాలని డిక్లరేషన్‌పై వివాదం సృష్టించారని విమర్శించారు. ఆ వివాదం వల్ల ప్రజలకు ఏం ఉపయోగమని అన్నారు. విశాఖ ప్రజలపై చంద్రబాబుకు ఎందుకంత ద్వేషమని మంత్రి మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందొద్దని చంద్రబాబు కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అమరావతి కుంభకోణం నిరూపించాలంటూనే, విచారణ ఆపాలని టీడీపీ కోర్టుకి వెళ్తోందని మంత్రి గుర్తు చేశారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే విషప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.