కొత్త మలుపు తిరిగిన బీహార్ రాజకీయం
బీహార్ రాజకీయాల్లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు. ఇప్పటికే ఎన్డీయే కూటమిలో లుకలుకలు కొనసాగుతుండగా ఇప్పుడు నితీష్ కుమార్ కు కొత్త చిక్కు వచ్చిపడింది. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే బీహార్ లో ప్రజలు ఎటువైపు మొగ్గుతారు అన్నది అత్యంత కీలకంగా మారనుంది. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న రామ్ విలాస్ పాశ్వాన్ కు చెందిన లోక్ జనశక్తి కూడా టిక్కెట్ల పంపకం విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇది ఎటువైపు దారితీస్తుందో తెలియటం లేదు. ఇప్పుడు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్ పి) సంచలన ప్రకటన చేసింది.బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తామని.. ఎన్డీఏ, ఆర్జేడీ నాయకత్వంలోని కూటమికి సమాంతరంగా మరో కూటమిని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మాజీ మంత్రి, ఆర్‌ఎల్‌ఎస్‌పీ నాయకుడు ఉపేంద్ర కుష్వాహ ప్రకటించారు.
ఈ ఫ్రంట్‌లో మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్‌పార్టీ భాగస్వామిగా ఉంటుందని కుష్వాహ చెప్పారు. గత పదిహేనేళ్ళుగా రాష్ట్రాన్ని ఏలిన నితీష్ కుమార్, అంతకు ముందు దశాబ్దంన్నర పాటు రాష్ట్రాన్ని ఏలిన లాలూ ప్రసాద్, రబ్రీదేవి పాలనలను ఒకే నాణేనికి ఇరువైపుల ఉన్న బొమ్మా బొరుసుగా ఆయన పేర్కొన్నారు. బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 28న తొలి విడత పోలింగ్ జరుగనుంది. నవంబర్ 3న రెండో విడత, నవంబర్ 7న మూడో దశ పోలింగ్ నిర్వహిస్తారు.