Telugu Gateway
Politics

చంద్రబాబుకు ‘బిగ్ ఛాలెంజ్’

చంద్రబాబుకు ‘బిగ్ ఛాలెంజ్’
X

తిరుపతి ఉప ఎన్నికను సర్కారు రిఫరెండగా అంగీకరిస్తుందా?

మూడు రాజధానులతో పాటు పలు సమస్యలకు ఈ ఎన్నికతో చెక్ పడుతుందా?

‘జగన్ సర్కారుపై విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పుడు ఎన్నికలు పెడితే మళ్ళీ టీడీపీదే అధికారం. ఏపీ రాజధానిగా అమరావతికి అప్పుడు ఒప్పుకుని..ఇప్పుడు మూడు రాజధానులు అంటూ మోసం చేశారు. ప్రజలు ఈ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మాట తప్పినందుకు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి.’ ఇదీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లు గత కొంత కాలంగా జూమ్ లో...ట్విట్టర్ లో చెబుతున్న మాటలు. జగన్ పాలనలో ప్రజలకు ఇసుక దొరకటం లేదు..సరైన మద్యం లేదు..అంతా అరాచకమే అంటూ టీడీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారు. అమరావతి విషయంలో మాటతప్పినందుకు రాజీనామా చేయండి చూద్దాం అంటూ సవాళ్ళు విసురుతున్నారు. ఈ తరుణంలో దురదృష్టవశాత్తూ తిరుపతి వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో ఖాళీ అయిన సీటును భర్తీ చేయాల్సి ఉంటుంది.

243 సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ అక్టోబర్ లో ప్రారంభం అయి నవంబర్ లో ముగియనున్నాయి. దీంతో బీహార్ ఎన్నికల చివరి విడత తేదీల్లోనే తిరుపతి లోక్ సభకు కూడా ఉప ఎన్నిక రావటం ఖాయం అని అంచనాలు ఉన్నాయి. ఏపీలో జగన్ సర్కారు కొలువుదీరిన 15 నెలల తర్వాత వస్తున్న తొలి ఉప ఎన్నిక ఇదే. దీంతో సహజంగానే అందరి చూపు దీనిపై పడుతుంది. అందులో తిరుపతి లోక్ సభ అంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గా ఉన్న చంద్రబాబు సొంత జిల్లాలోని నియోజకవర్గం. చంద్రబాబు సొంత జిల్లా కావటం ఒకెత్తు అయితే...రాష్ట్రానికి మధ్యలో ఉందని రాజధానికి అమరావతిని ఎంపిక చేస్తే జగన్ దీన్ని విశాఖపట్నానికి మారుస్తారని..రాయలసీమ ప్రాంతానికి విశాఖపట్నం చాలా దూరం అవుతుందని వాదన టీడీపీ నేతలు తెరమీదకు తీసుకొచ్చారు. మరి ఇప్పుడు చంద్రబాబు అండ్ కో చెబుతున్న మూడు రాజధానులకు, జగన్ పాలన వ్యతిరేకంగా తిరుపతి లోక్ సభ ఫలితం వస్తుందా?. లేక అధికార పార్టీకే అనుకూలంగా వస్తుందా?. అన్నది అత్యంత ఆసక్తిరేపనున్న అంశంగా మారనుంది.

సహజంగా ఉప ఎన్నిక అంటే అధికార పార్టీకి అనుకూలంగానే ఫలితాలు వస్తాయి. పదిహేను నెలల క్రితమే 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీలను గెలుచుకున్న వైసీపీకి కూడా ఇది ఛాలెంజ్ వంటిదే. 22 సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ ఇప్పుడు ఏమీ చేయలేం అని ప్రకటించేశారు. మనపై ఆధారపడే పరిస్థితి వచ్చే వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని ఇప్పుడు చెబుతున్నారు. అంతే కాదు..విభజన చట్టంలో రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన అంశాలపైనా కేంద్రంతో గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. దీనికి తోడు వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలు ఎదుర్కొన్న తీవ్ర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అంటే ఇసుక సమస్య, మద్యం ధరల పెంపు, దళితులప దాడులు వంటి వంటి అంశాలు ఉన్నాయి. జగన్ పాలన వదిలేసి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ పదే పదే విమర్శిస్తోంది. మరి తిరుపతి ఉప ఎన్నిక ఈ విమర్శలు అన్నింటికి సమాధానం చెబుతుందా?. 2019 ఎన్నికల్లో బల్లి దుర్గాప్రసాద్ కు 228,376 ఓట్ల మెజారిటీ వచ్చింది.అధికార వైసీపీ ఇంత కష్టకాలంలో కూడా తాము సంక్షేమాన్ని ఏ మాత్రం విస్మరించలేదని..నవరత్నాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని చెబుతోంది. మరి ఈ మెజారిటీని తిరిగి దక్కించుకుంటారా లేదా అన్నది వేచిచూడాల్సిందే. తిరుపతి లోక్ సభ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు నెల్లూరు జిల్లాలో ఉండగా..మూడు నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ఏపీ రాజకీయాలకు ఈ ఉప ఎన్నిక అత్యంత కీలకం కానుంది.

Next Story
Share it