బాలుకు భారతరత్న ఇవ్వండి
ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ
భారతీయ చిత్ర పరిశ్రమకు దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం నాడు ప్రధాని నరేంద్రమోడికి లేఖ రాశారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో బాలసుబ్రమణ్యం ఏకంగా 40 వేలకు పైగా పాటలు పాడారని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ఉత్తమ నేపథ్యగాయకుడిగా ఆరు సార్లు జాతీయ అవార్డులు, ఏపీ ప్రభుత్వం నుంచి ఏకంగా 25 నంది అవార్డులు, ఫిల్మ్ ఫేర్ తోపాటు ఎన్నో పురస్కారాలు అందుకున్నారని పేర్కొన్నారు.
భారతీయ సంగీతానికి ఆయన అందించిన సేవలకు గాను భారతరత్న ఇవ్వాలన్నారు. బాలసుబ్రమణ్యం పేరుతో ఆయన సొంత జిల్లా నెల్లూరులో సంగీత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం నాడు సీఎం జగన్ కు లేఖ రాశారు. అందులో ఎస్పీ బాలు కాంస్య విగ్రహం కూడా ఏర్పాటు చేయాలన్నారు. చంద్రబాబు సీఎం జగన్ కు లేఖ రాస్తే ..సీఎం జగన్ భారతరత్న కోసం ప్రధాని నరేంద్రమోడికి లేఖ రాశారు.