Telugu Gateway
Politics

ఉత్కంఠ రేపుతున్న బాబ్రీ కేసు తీర్పు

ఉత్కంఠ రేపుతున్న బాబ్రీ కేసు తీర్పు
X

అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగి 28 సంవత్సరాలు అయింది. 1992 డిసెంబర్ 6న ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. అత్యంత కీలకమైన ఈ అంశానికి సంబంధించిన తీర్పు సెప్టెంబర్ 30న రానుంది. లక్నోలోని సీబీఐ కోర్టు ఈ క్రిమినల్ కేసుకు సంబంధించి తీర్పు బుధవారం నాడు వెలువరించనుంది. ముఖ్యంగా ఈ తీర్పుతో బిజెపికి చెందిన కీలకనేతలు అయిన ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి ల భవితవ్యం ఈ తీర్పుతో తేలనుంది. అందుకే బిజెపితో పాటు అందరిలో ఈ కేసు తీర్పుపై ఉత్కంఠ నెలకొని ఉంది. కేసు ట్రయల్ లో మొత్తం 32 మందిని విచారించారు. ఇందులో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ కూడా ఉన్నారు. బాబ్రీ కేసు విచారణ పూర్తయ్యేందుకు 28 సంవత్సరాలు పట్టింది అంటే ఇది ఎంత నత్తనడకన సాగిందో అర్ధం అవుతోంది. కేసు విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది. ఈ మేరకు 2017 ఏప్రిల్ 19న రోజువారీగా ఈ కేసులో హియరింగ్ పూర్తి చేయాలని ఆదేశించింది. రాముడి పుట్టిన జన్మస్థలం అంటూ కొంత మంది ఆందోళనకారులు 1992లో అయోధ్యలోని బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.

చివరకు ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగి 2019 నవంబర్ లో సుప్రీంకోర్టు తీర్పుతో ఓ కొలిక్కి వచ్చిన విషయం తెలిసిందే. బాబ్రీ విధ్వంసంతో దేశ వ్యాప్తంగా మత ఘర్షణలు చోటుచేసుకుని ఏకంగా 1800 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. బాబ్రీ విధ్వంసంపై మొత్తం రెండు ఎప్ఐఆర్ లు నమోదు కాగా తొలి ఎఫ్ఐఆర్ నెంబర్ 197/92గా ఉంది. ఇది గుర్తు తెలియని లక్షలాది మంది కరసేవకులపై పెట్టారు. రెండవ ఎఫ్ఐఆర్ 198/92లో ఎల్ కె అద్వానీ, మురళీమనోహర్ జోషి, ఉమా భారతి, వినయ్ కతియార్, విశ్వహిందూ పరిషత్ కు చెందిన అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిషోర్, విష్ణు హరిదాల్మియా, సాద్వి రితంబరల పేర నమోదు అయింది. జర్నలిస్టులతోపాటు ఇతర దాడులకు సంబంధించి మొత్తం 47 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి.

Next Story
Share it