చంద్రబాబా...లోకేషా?
ఎవరి మాట నెగ్గుతుంది?
అచ్చెన్నాయుడు కాకపోతే ఇక టీడీపీలో అంతే!
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సాగదీయకుండా ఎప్పుడూ ఏ పని చేయరు. చివరకు తన కుప్పం సీటును కూడా చివరి నిమిషంలోనే ప్రకటిస్తారు. అది ఆయనకు ఓ అలవాటు. కానీ ఈ డిజిటల్ యుగంలో అది చెల్లుబాటు కాదని టీడీపీ నేతలే ఎద్దేవా చేస్తున్నారు. సెప్టెంబర్ 27న కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అచ్చెన్నాయుడి పేరు ఖరారు అయిపోయిందని..ఇక ప్రకటన చేయటమే ఆలశ్యం అన్న తరహాలో వార్తలు వెలువడ్డాయి. అది పార్టీ నుంచి వచ్చిన లీకుల ఆధారంగా వచ్చినవే. నిజంగా అలాంటిది ఏమీ లేకపోతే పార్టీ ఖండన ఇఛ్చి ఉండేది. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. కానీ సడన్ గా రాష్ట్ర అధ్యక్ష పదవిని పక్కన పెట్టి లోక్ సభ నియోజకవర్గాల వారీ అధ్యక్షుల పేర్లను ప్రకటించారు. అందులోనూ చాలా మంది ఔట్ డేటెడ్ నేతలు ఉన్నారనే విమర్శలు సొంత పార్టీ నేతలనుంచే వస్తున్నాయి.ఇదంతా ఒకెత్తు అయితే అచ్చెన్నాయుడి పేరు ప్రకటించకపోవటం వెనక టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒత్తిడి ఉందని..అచ్చెన్నాయుడిని అధ్యక్షుడుగా ప్రకటించటం లోకేష్ కు ఇష్టంలేదనే వార్తలు గుప్పుమన్నాయి.
ఇందులో ఎంత మేరకు నిజం ఉందో తేలాల్సి ఉంది. అయితే అచ్చెన్నాయుడి ప్రకటన ఆగిపోవటంతో అటు పార్టీ నేతలు, కార్యకర్తల్లో అయోమయం అయితే నెలకొంది. తాజా పరిణామాలు చూసిన తర్వాత అసలు టీడీపీలో ఏమి జరుగుతోంది?. ఎందుకు అచ్చెన్నాయుడి పేరు తొలుత బయటకు వచ్చింది?. ఎవరు పంపించారు. ఇప్పుడు ఎవరు ఆపించారు. నిజంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడు కాకుండా మరొకరు పేరు తెరమీదకు వస్తే టీడీపీలో ముసలం పుట్టడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతిపక్షంలో పనేమీ లేకుండా ఖాళీగా ఉన్న సమయంలో కూడా అధ్యక్షుడి పేరు ఎంపికకు ఇంత సీన్ అవసరం ఉందా? అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే తొలుత ప్రకటించినట్లు అచ్చెన్నాయుడు కాకుండా వేరే ఎవరి పేర్లు ప్రకటించినా కూడా టీడీపీలో ఖచ్చితంగా ముసలం పుట్టడటం ఖాయంగా చెబుతున్నారు. పార్టీలో నారా లోకేష్ కు సీనియర్ నేతల నుంచి ఏ మాత్రం ఆమోదం లభించటం లేదు. ఈ తరుణంలో చంద్రబాబు ఖరారు చేసిన పేరును నారా లోకేష్ పక్కన పెట్టారనే అభిప్రాయం వస్తే అది పార్టీకి ఏ మాత్రం మేలు చేయకపోగా మరింత నష్టం చేస్తుందని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.