ఖాళీ కుర్చీకి గవర్నర్ నమస్కారం..అసలు కథేంటి అంటే..!

పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..గవర్నర్ జగదీప్ దంఖర్ ల మధ్య గత కొంత కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అది ఏ స్థాయికి చేరింది అంటే..ఏకంగా స్వాతంత్ర దినోత్సవం రోజున గవర్నర్ నిర్వహించే ఎట్ హోంకు డుమ్మా కొట్టే వరకూ వెళ్లింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉధయం జెండా ఆవిష్కరణలు చేస్తారు..సాయంత్రం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు, ఇతర రాజకీయ ప్రముఖలకు గవర్నర్ తేనీటి విందు ఇవ్వటం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి కోవిడ్ 19 కారణంగా పరిమిత సంఖ్యలో చేయాలని..ఈ విషయంలో గరవ్నర్లే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఎప్పటిలాగానే బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంఖర్ శనివారం సాయంత్రం ఎట్ హోం నిర్వహించారు. దీనికి సీఎం మమతా బెనర్జీతోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారులెవరూ హాజరుకాలేదు.
దీంతో ఖాళీగా ఉన్న సీఎం సీటు కు నమస్కారం పెడుతున్న ఫోటోను ట్వీట్ చేశారు గవర్నర్. అంతే కాదు..రాజ్ భవన్ లో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గైర్హాజరు కావటం తనకు ఆశ్చర్యం కలిగించిందని..ఏమి మాట్లాడాలో కూడా తెలియటం లేదన్నారు. ఇటువంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్‌కు ఉన్న గొప్ప సంస్కృతి, నీతిని పలుచన చేస్తుందన్నారు. ఇది ఒక అనాలోచిత ధోరణి అని ట్వీట్ చేశారు. అయితే సీఎం మమతా బెనర్జీ మాత్రం స్వాతంత్ర దినోత్సవ పరేడ్ అనంతరం నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలసి వెనక్కిపోయారు. సాయంత్రం జరిగే ఎట్ హోం కు మాత్రం డుమ్మా కొట్టారు.



