Telugu Gateway
Politics

సెప్టెంబర్ 7 నుంచి మైట్రో రైళ్ళ పరుగులు

సెప్టెంబర్ 7 నుంచి మైట్రో రైళ్ళ పరుగులు
X

వచ్చే నెల 21 నుంచి వంద మందితో సమావేశాలకు ఓకే

సినిమా హాళ్ళు..ఎంటర్ టైన్ మెంట్ పార్కులకు నో ఛాన్స్

సెప్టెంబర్ 30 వరకూ స్కూళ్ళూ బంద్

దేశంలో మైట్రో రైళ్ళ పరుగులు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్ళ నిర్వహణకు కేంద్ర హోం శాఖ అనుమతి మంజూరు చేసింది. అన్ లాక్ 4లో భాగంగా మరికొన్ని మినహాయింపులు ఇస్తూ శనివారం నాడు మార్గదర్శకాలు జారీ చేశారు. సెప్టెంబర్ 21 నుంచి వంద మందితో సామాజిక/ఆర్ధిక, క్రీడా, ఎంటర్ టైన్ మెంట్, సాంస్కృతిక, మతపరమైన, రాజకీయ కార్యకలాపాల నిర్వహణకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సమావేశాల సమయంలో విధిగా మాస్క్ ధరించటంతోపాటు సామాజిక దూరం పాటించటం వంటి నిబంధనలను విధిగా పాటించాలన్నారు.

అదే సమయంలో సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్ల ను తెరిచేందుకు కూడా అనుమతించారు. రాష్ట్రాలు..కేంద్ర పాలిత ప్రాంతాలతో విస్తృతంగా చర్చించిన మీద సెప్టెంబర్ 30 వరకూ పాఠశాలలు, కాలేజీలు, విద్యా సంస్థలను తెరవరాదని నిర్ణయించారు. కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు లాక్ డౌన్లు ప్రకటించటానికి వీల్లేదని స్పష్టం చేశారు. అంతర్ రాష్ట్ర రవాణాతోపాటు రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళటంపై ఎలాంటి ఆంక్షలు పెట్టడానికి వీల్లేదు.

పెళ్లిళ్ళపై ప్రస్తుతం ఉన్న 50 మంది అతిధుల పరిమితి కొనసాగనుంది. అంత్యక్రియల విషయంలో 20 మందిని మాత్రమే అనుమతిస్తారు. సెప్టెంబర్ 20 తర్వాత వంద మందిని అనుమతించున్నారు. సినిమా హాళ్ళు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్ టైన్ మెంట్ పార్కులు, థియేటర్లు అనుమతించరు. సెప్టెంబర్ 30 వరకూ కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ కొనసాగనుంది. ప్యాసింజర్ రైళ్ళు, అంతర్జాతీయ విమానాలు అనుమతించిన మేరకు మాత్రమే నడుస్తాయి.

Next Story
Share it