Telugu Gateway
Telangana

తెలంగాణలో కరోనా టెస్ట్ ల సంఖ్య మరింత పెంచాలి

తెలంగాణలో కరోనా టెస్ట్ ల సంఖ్య మరింత పెంచాలి
X

కెసీఆర్ కు ప్రధాని మోడీ సూచన

తెలంగాణతోపాటు బీహార్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ల్లో కోవిడ్ 19 టెస్ట్ ల సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. ప్రధాని మంగళవారం నాడు పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పాల్గొన్నారు. ఆయన తెలంగాణలో కరోనా పరిస్థితిని వివరించటంతోపాటు..పలు సూచనలు చేశారు. కరోనా దేశంలో వైద్య సదుపాయాలను పెంచాల్సిన అవసరాన్ని కరోనా గుర్తు చేసిందని సిఎం అన్నారు. ‘‘కరోనా అనుభవాలు మనకు పాఠం నేర్పాయి. దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది. వైద్య రంగంలో భవిష్యత్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో విజనరీతో ఆలోచించాలి. సమగ్ర వైద్య సదుపాయాల కోసం ప్రణాళిక వేయాలి. కేంద్రాలు, రాష్ట్రాలు కలిసి ఈ ప్రణాళిక అమలు చేయాలి. గతంలో మనకు కరోనా లాంటి అనుభవం లేదు. ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. దీన్ని ఎదుర్కొంటూనే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు వస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విషయంపై దృష్టి పెట్టాలి.

గతంలో కూడా అనేక వైరస్ లు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. కరోనా వైరస్ లాంటివి భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉంది. వైద్య రంగంలో ఏ విపత్కర పరిస్థితి తలెత్తినా సరే తట్టుకునే విధంగా మనం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి. జనాభా నిష్పత్తి ప్రకారం ఎంత మంది డాక్టర్లు ఉండాలి? ఇంకా ఎన్ని మెడికల్ కాలేజీలు రావాలి? లాంటి విషయాలను ఆలోచించాలి. ఐఎంఎ లాంటి సంస్థలతో సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలి. ఇది తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. ఇది దేశానికి మంచి చేసే చర్య. కరోనా లాంటివి భవిష్యత్తులో ఏమి వచ్చినా సరే తట్టుకుని నిలబడే విధంగా వైద్యరంగం తయారు కావాలి.

దీనికోసం ప్రధాన మంత్రి చొరవ తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్రం కలిసికట్టుగా పని చేసి, దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది’’ అని ముఖ్యమంత్రి సూచించారు. ‘‘రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో రికవరీ రేటు 71 శాతం ఉంది. మరణాలు రేటు 0.7 శాతం ఉంది. పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం. కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. కావల్సినన్ని బెడ్లు, మందులు, ఇతర పరికరాలు,సామాగ్రి సిద్ధంగా ఉంచాం. ఐసిఎంఆర్, నీతి ఆయోగ్, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నాం. వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఇతర ప్రభుత్వ యంత్రాంగం అంతా శక్తి వంచన లేకుండా పని చేస్తున్నది’’ అని ముఖ్యమంత్రి వివరించారు.

Next Story
Share it