వచ్చే నెలలో తెలంగాణ ఎంసెట్

తెలంగాణ సర్కారు పెండింగ్ లో ఉన్న పరీక్షల షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే కోర్టు ఆమోదం తర్వాత ఈ తేదీలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఉన్నత విద్యామండలి సోమవారం ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు కరసత్తు పూర్తయింది. ఈ నెల 31న ఈసెట్, సెప్టెంబర్ 2న పాలిసెట్ నిర్వహించనుంది. అలాగే సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలను నిర్వహించాలని ప్రతిపాదించారు. కోర్టు అనుమతితో ఈ తేదీలను ఉన్నత విద్యామండలి అధికారికంగా ప్రకటించనుంది.
అగ్రికల్చర్ ఎంసెట్ సహా లాసెట్, పీజీఈసెట్, ఎడ్సెట్, ఐసెట్, పీఈసెట్ తదితర సెట్స్ తేదీలను పరీక్షల నిర్వహణలో సాంకేతిక సహకారం అందించే టీసీఎస్ స్లాట్స్ ను బట్టి తేదీలను ఖరారు చేయాలని నిర్ణయించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో 2020–21 విద్యా సంవత్సరంలో అకడమిక్ వ్యవహారాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది. అయితే తాము తీసుకున్న నిర్ణయాలను హైకోర్టుకు తెలియజేసి, కోర్టు ఆమోదంతో అమల్లోకి తేవాలని నిర్ణయించింది.