Telugu Gateway
Andhra Pradesh

మూడు రాజధానుల చిక్కుముళ్లను జగన్ విప్పుతారా?

మూడు రాజధానుల చిక్కుముళ్లను జగన్ విప్పుతారా?
X

ఏపీ సీఎం జగన్ ఎంత దూకుడు చూపిస్తుంటే..అంతే స్పీడ్ గా బ్రేక్ లు పడుతున్నాయి. తాజాగా ఏకంగా ముఖ్యమంత్రి జగన్ తోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రులు, ఇతర పార్టీల నేతలకు హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. కోర్టులో ఏకంగా అమరావతి అంశంపై డెబ్బయికి పైగా పిటీషన్లు దాఖలాయ్యాయి. ఇవి ఎప్పటికి తేలాలి. మూడు రాజధానులు ఎప్పటికి ముందు పడాలి. పిటీషనర్లు ఏకంగా ప్రతిపక్షంలో ఉండగా రాజధాని అమరావతికి సంబంధించిన అంశంపై జగన్ తోపాటు వైసీపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అమరావతికి అనుకూలంగా చేసిన ప్రకటనల వీడియోలను పిటీషన్లకు జతచేసినట్లు చెబుతున్నారు. సీఎం జగన్ అయితే..అమరావతిలో తాను ఇళ్ళు..ఆఫీసు కట్టుకుంటుంటే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వీటి అన్నింటికి వీడియో సాక్ష్యాలే ఉన్నాయి. వీటికి సీఎం హోదాలో ఇప్పుడు జగన్ ఏమి సమాధానం చెబుతారు అన్నది అత్యంత కీలకంగా మారనుంది.

ప్రత్యేక హోదా విషయంలో జగన్ ఎన్నికలకు ముందు పదే పదే ఓ మాట చెప్పేవారు. పార్లమెంట్ లో ప్రధాని లాంటి వ్యక్తి ఇచ్చిన మాటకు విశ్వసనీయత, గౌరవం ఉండాలంటే ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలనేవారు. కానీ ఇదే జగన్ అప్పటి సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా అసెంబ్లీ సాక్షిగా అమరావతికి అంగీకరించిన మాట వాస్తవం. వీటి ఆధారంగానే ఇప్పుడు కోర్టు అందరికీ నోటీసులు జారీ చేసి సమాధానాలు కోరింది. జగన్ మూడు రాజధానులను వ్యతిరేకించే వారు..అనుకూలంగా వాదించే వారు ఉన్నారు. అయితే ఇందులో అత్యంత కీలకమైన అంశం రాజధాని రైతులు. రాజధాని కోసం అని రైతులు భూములు ఇఛ్చారు. ఆ భూములకు ప్రతిఫలంగా వార్షిక కౌలుతోపాటు అమరావతిలో వచ్చే సకల సౌకర్యాల రాజధానితో విలువ వస్తుంది అని వాణిజ్యప్లాట్లు కేటాయించారు.

కానీ ఇప్పుడు జగన్ సర్కారు మూడు రాజధానుల నిర్ణయంతో రైతులకు ఇచ్చే వాణిజ్య ఫ్లాట్లకు పెద్దగా విలువ వచ్చే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఒరిజినల్ ప్లాన్ వేరు..ఇప్పుడు సర్కారు అమలు చేస్తామంటున్నది వేరు. మరి ఇది ఒప్పంద ఉల్లంఘన కిందకే వస్తుంది. దీనికి తోడు ఇప్పటివరకూ అమరావతిపై చేసిన వ్యయం 10 నుంచి 15 వేల కోట్ల రూపాయల సంగతేంటి అన్న ప్రశ్న వస్తుంది. ఏపీ హైకోర్టు సెప్టెంబర్ 21 నుంచి రోజువారీ విచారణ చేపడతామని ప్రకటించింది. ఎంత స్పీడ్ గా విచారణ సాగినా కూడా ఇది పూర్తవటానికి తక్కువలో తక్కువ డిసెంబర్ వరకూ పడుతుందని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు వచ్చే విద్యా సంవత్సరానికి అయినా వైజాగ్ కు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వెళుతుందా?. సహజంగా తాను అనుకున్న పని విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గని వైఖరి చూపించే సీఎం జగన్ ఇప్పుడు ఏమి చేస్తారు?.

విశాఖపట్నం పోయి కూర్చుని అక్కడ నుంచే పరిపాలన సాగిస్తారా?. సీఎంను ఇక్కడ ఉండి పాలన చేయమని చెప్పే అధికారం కోర్టులకు ఉండదు. సీఎం జగన్ అలా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే ఏపీకి రాజధాని వ్యవహారం అన్నది ఓ పెద్ద సమస్యగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని నిర్మించేందుకు వచ్చిన చారిత్రక అవకాశాన్ని కాలదన్నుకున్నారు. ఇప్పుడు జగన్ మూడు రాజధానుల నిర్ణయంతో కొత్త వివాదంలోకి రాజధాని అంశాన్ని నెట్టారు. ఏది ఏమైనా ఏపీ ప్రజలు మాత్రం ‘రాజధాని మధ్యలో నలుగుతున్నారు’. ఇది ఎప్పటికి తేలుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it