Telugu Gateway
Telangana

వ్యాక్సిన్ కోసం భారత్ చూపు హైదరాబాద్ వైపే

వ్యాక్సిన్ కోసం భారత్ చూపు హైదరాబాద్ వైపే
X

తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ మంగళవారం నాడు జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడే ‘వ్యాక్సిన్ పరుగు, సైన్స్ ను సమతుల్యం చేయటం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న కెటీఆర్ కోవిడ్ 19ను ఎదుర్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా సిద్ధం అవుతున్న వ్యాక్సిన్లు ఏయే దశల్లో ఉన్నాయనే అంశాలపై చర్చించారు. అదే సమయంలో కోవిడ్ 19కి సంబంధించి వ్యాక్సిన్ కోసం దేశం అంతా హైదరాబాద్ వైపే చూస్తోందని వ్యాఖ్యానించారు. హైద‌రాబాద్‌లో ఉన్న భార‌త్‌బ‌యోటెక్ సంస్థ నుంచే ఆ టీకా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ సమావేశంలో కేటీఆర్‌తో పాటు డాక్ట‌ర్ కృష్ణ ఎల్లా, మహిమ దాట్ల తదితరులు పాల్గొన్నారు. క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ త‌యారీలో భార‌త్‌బ‌యోటెక్ ముందంజంలో ఉండ‌డం గ‌ర్వంగా ఉంద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యాక్సిన్ ల అభివృద్ధి, త‌యారీలో భార‌త్ భాగ‌స్వామ్యం కీల‌క‌మైంద‌ని ప్ర‌పంచ‌దేశాలు ప‌దేప‌దే చెబుతున్నాయ‌‌ని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాక్సిన్ అవ‌స‌రాల దృష్ట్యా హైద‌రాబాద్ ప్రాముఖ్య‌త కూడా పెరిగిన‌ట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథ‌న్ కూడా మంత్రి కేటీఆర్ నిర్వహించిన చ‌ర్చ‌లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ భారత వ్యాక్సిన్ ఉత్పత్తిలో 70 శాతం వాటా హైదరాబాద్ లోని మూడు కంపెనీల నుంచే వస్తున్నాయని తెలిపారు. ప్రపంచంలోని ఏ వ్యాక్సిన్ కంపెనీల కంటే హైదరాబాద్ కంపెనీలు తక్కువ కాదన్నారు. ప్రపంచం మొత్తానికి అందించే వ్యాక్సిన్ నాణ్యతలో ఏ మాత్రం తేడా ఉండదని..విదేశాలకు సరఫరా చేసేది అయినా..భారత్ లో సరఫరా చేసేది అయినా ఒక్కటే అన్నారు. వేగంగా వ్యాక్సిన్ తేవటానికి ఎవరి అవసరాలు ఏమిటో కేంద్రం తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రతి చిన్న అనుమతి కోసం ఢిల్లీ వెళ్ళాల్సి వస్తోందని..ప్రాంతీయ స్థాయిలో కూడా అనుమతులు ఇచ్చేలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Next Story
Share it