Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ మోడల్ నే ఫాలో అవుతున్న టీడీపీ

వైసీపీ మోడల్ నే ఫాలో అవుతున్న టీడీపీ
X

అప్పుడు చంద్రబాబు వీడియోలు..ఇప్పుడు జగన్, వైసీపీ నేతల వీడియోలు

సీన్లు రిపీట్ అవుతున్నాయి. అప్పుడు వైసీపీ చేసిన పనే ఇప్పుడు టీడీపీ చేస్తోంది. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఎన్నిసార్లు మాట మార్చారో చూడండి అంటూ పలు సందర్భాల్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. ఇది చాలా వరకూ చంద్రబాబుపై ప్రజల్లో ముఖ్యంగా యువతలో వ్యతిరేక భావం ఏర్పడటానికి కారణం అయింది. ఇప్పుడు టీడీపీ అదే పనిచేస్తోంది. ప్రతిపక్షంలో ఉండగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలుకుని ఆ పార్టీ నేతలు అమరావతిపై ఏమేమి చెప్పారో ఈ వీడియోలను టీడీపీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. జగన్ అసెంబ్లీ సాక్షిగా, వైసీపీ ప్లీనరీలోనూ ఎక్కడా అమరావతికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదు. పైగా తాము అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తామని దుష్ప్రచారం చేస్తున్నామని వైసీపీ నేతలు ‘వీడియోల సాక్షిగా’ ప్రకటించారు. ఇప్పుడు వాటినే టీడీపీ అస్త్రాలు మార్చుకుంటోంది.

ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడానికి ఇష్టం లేకే అమరావతిని అంగీకరిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. ప్లీనరీలోనూ అదే వాయిస్ విన్పించారు. చంద్రబాబు అమరావతిలో కనీసం ఇళ్లు కూడా కట్టుకోలేదని..అమరావతిని మార్చేవారు అయితే జగన్ ఇక్కడ ఇళ్లు, ఆఫీసు ఎందుకు కట్టుకుంటారని మరీ ప్రశ్నించారు వైసీపీ నేతలు. ఇప్పుడు టీడీపీకి అవే అస్త్రాలుగా మారాయి. అటు చంద్రబాబు అయినా..ఇటు జగన్ అయినా మాట మార్చటం మా జన్మహక్కు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో అంటే నడిచిపోయేది.ఈ డిజిటల్ యుగంలో ఎవరు..ఎప్పుడు, ఎక్కడ ఏమి మాట్లాడారో అంతా రికార్డు అవుతోంది.

ఆ రికార్డులనే వాడుకుంటున్నాయి ఆయా పార్టీలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడిన అత్యంత కీలక అంశాలైన ప్రత్యేక హోదా, అమరావతి విషయంలో మాత్రం ‘రివర్స్ గేర్లు’ వేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం నడిపించిన జగన్ ఎప్పుడో ఒకప్పుడు ప్రత్యేక వస్తుంది..అప్పటి వరకూ వైసీపీని గెలిపించండి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. కానీ అంతకు ముందు ఆయన చెప్పింది మాత్రం వైసీపీకి 25 ఎంపీ సీట్లు వస్తే హోదా సాధిస్తానని ప్రకటించారు. ఏపీ ప్రజలు ఏకంగా 22 ఎంపీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం హోదా అంశంపై చేతులెత్తేశారు. రాజధాని అమరావతి విషయంలోనూ అదే సీన్. ప్రతిపక్షంలో ఉండగా ఎప్పుడూ అభివృద్ధి వికేంద్రీకరణ గురించి ప్రస్తావించని వారంతా ఇప్పుడు అదే జపం చేస్తున్నారు.

Next Story
Share it