Telugu Gateway
Politics

టీఆర్ఎస్ లో షాకింగ్ పరిణామం..రేవంత్ పై స్వామిగౌడ్ ప్రశంసలు

టీఆర్ఎస్ లో షాకింగ్ పరిణామం..రేవంత్ పై స్వామిగౌడ్ ప్రశంసలు
X

రేవంత్ రెడ్డి. ఆ పేరు చెపితే చాలు టీఆర్ఎస్ నేతలు మండిపడతారు. పొరపాటున కూడా రేవంత్ పేరు ఎత్తటానికి కూడా చాలా మంది నేతలు ఇష్టపడరు. అలాంటిది టీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ ఏకంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే తెలంగాణ శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ టీఆర్ఎస్ అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగరేసినట్లే కన్పిస్తోంది. తాజా పరిణామాలు అన్నీ ఈ దిశగానే సాగుతున్నట్లు కన్పిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఆయన కొన్ని కులాల చేతిలోనే అధికారం ఉండపోతుందని వ్యాఖ్యానించారు. వెనకబడిన వర్గాలకే సరైన ప్రాతినిధ్యం దక్కటం లేదన్నారు. ఈ వ్యాఖ్యల కలకలం ముగియక ముందే ఆదివారం నాడు మరోసారి రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించటంతో పాటు రాజకీయాలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పుట్టింది రెడ్డి సామాజిక వర్గంలో అయినా బడుగు వర్గాలకు చేతికర్రగా మారిండు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచే వ్యక్తులను మనం గుర్తించాలి.. వారికి అండగా నిలబడాలి.

తెల్ల బట్టల వారికి మనం అమ్ముడు పోవొద్దు. రూ. 2500 కోట్లు ఉన్న వ్యక్తిని ఒక పార్టీ నిలబడితే, 3500కోట్లు ఉన్న వ్యక్తిని మరో పార్టీ నిలబెడుతోంది. ఒక పార్టీ 10 మందిని చంపినోడిని నిలబడితే.. మరో పార్టీ 15మందిని చంపినోడిని నిలబెట్టాలని చూస్తోంది. ఇలాంటి రాజకీయాలను ప్రజలు గమనించాలి.. చైతన్యం కావాలి. యువత రాజకీయాల్లోకి రావాలి.. కొత్త రాజకీయాలకు రూపుదిద్దాలి. అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది అని స్వామిగౌడ్ వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు బోయినపల్లిలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన స్వామిగౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మొన్న చేసిన వ్యాఖ్యలు నర్మగర్భంగా ఉన్నాయనే కారణంతో టీఆర్ఎస్ అధిష్టానం చూసీచూడనట్లు వదిలేసింది. మరి ఇఫ్పుడు రేవంత్ రెడ్డిపై కౌన్సిల్ మాజీ ఛైర్మన్ అయిన స్వామిగౌడ్ ప్రశంసలు కురిపించిన తరుణంలో పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story
Share it