Telugu Gateway
Politics

కొన్ని కులాల వారే పరిపాలన నడిపిస్తున్నారు

కొన్ని కులాల వారే పరిపాలన నడిపిస్తున్నారు
X

శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని కులాలకు చెందిన అతి కొద్ది మందే పరిపాలనా, ప్రజస్వామ్యాన్ని నడిపిస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ లో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నారాయణ గురు జయంతి వేడుకల్లో స్వామి గౌడ్ పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దేశంలో కుల రక్కసి తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తూ బడుగుబలహీన వర్గాలకు అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రాష్ట్రం లో కొన్ని కొన్ని కులాలకు చెందిన వారే పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నారు. వందేళ్ల క్రితం ఏర్పడ్డ కుల రక్కసి పునాదులే ఇప్పటికి పరిపాలనలో కొనసాగుతున్నాయి. ఇది బలహీన వర్గాలపై జరుగుతున్న దాడి.

దేశంలో గుడి, బడి కొంతమందికే పరిమితి కావడం, మళ్ళీ మొదటికి రావడం వల్లే నారాయణ గురును గుర్తు చేసుకుంటున్నాం. ఏకరూప సిద్ధాంతాన్ని దేశంలో విస్తరింపజేయాలని కృషి చేసిన నారాయణ గురు ఆశయాలను బడుగు బలహీన వర్గాల ప్రజలు ముందుకు తీసుకెళ్లాలి. అధికారం కొంతమందికే పరిమితం పరిమితమైంది. నారాయణ గురు స్పూర్తితో అన్ని వర్గాల ప్రజలు ఐక్యం కావాలి. కులం, మతం పక్కన పెట్టి ఎవరికైతే తెలివితేటలు ఉంటాయో, ఎవరైతే పరిపాలన సాగించగలరో, ప్రజాస్వామ్యాన్ని కాపాడగలరో, అలాంటి వ్యక్తులు ఏకారుప సిద్ధాంతంపై ఏకమయ్యే రోజు త్వరలోనే రాబోతుంది.'' అని స్వామిగౌడ్ వ్యాఖ్యానించారు. స్వామిగౌడ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి.

Next Story
Share it