Telugu Gateway
Politics

రాహుల్ ను అడ్డుకుంటే కాంగ్రెస్ ఇక అంతే

రాహుల్ ను అడ్డుకుంటే కాంగ్రెస్ ఇక అంతే
X

ఓ వైపు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టానికి రాహుల్ గాంధీ ససేమిరా అంటున్నారు. ఎంత మంది కోరినా ఇటీవల వరకూ ఆయన నో చెబుతూనే వచ్చారు. పార్టీలో సీనియర్ నేతలకు, రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ ఉందనే విషయం మాత్రం తాజాగా జరిగిన సీడబ్ల్యూసీలో మరోసారి స్పష్టం అయింది. రాహుల్ ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలోకి కొత్త రక్తం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీటికి సీనియర్లు అడ్డుపడుతూ వస్తున్నారు. ఈ వ్యవహారం ఎంతకూ తేలకపోవటంతో రాహుల్ గాంధీ పగ్గాలు వదిలేసి..బయట నుంచే ప్రధాని మోడీ, బిజెపిపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ లో చోటుచేసుకున్న పరిణామాలపై శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ సామ్నాలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన రాహుల్ కు మద్దతుగా నిలబడ్డారు. పార్టీ నాయకత్వం చేపట్టకుండా సినియర్లు రాహుల్‌ గాంధీని నిలువరిస్తే ఆ పార్టీ పని అయిపోయినట్లేనని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సరితూగే స్ధాయి కలిగిన నేత కాంగ్రెస్‌లో లేరని రౌత్‌ శివసేన పత్రిక సామ్నాలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ తాత్కాలిక చీఫ్‌ సోనియా గాంధీకి 23 మంది ఆ పార్టీ సీనియర్‌ నేతలు లేఖ రాయడం పట్ల శివసేన ఎంపీ విస్మయం వ్యక్తం చేశారు. సీనియర్‌ నేతలు పార్టీలో క్రియాశీలకంగా ఉండకుండా నిరోధించిన వారు ఎవరని ప్రశ్నించారు. రాహుల్‌కు నాయకత్వ పగ్గాలు అప్పగించకుండా అడ్డుకుంటే అది పార్టీ వినాశనానికి దారితీస్తుందని రౌత్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నడూ చావులేని వృద్ధ మహిళ వంటిదని ఆ పార్టీ దివంగత నేత వీఎన్‌ గాడ్గిల్‌ అభివర్ణించేవారని, అలాంటి పార్టీని ఎలా కాపాడుకోవాలో రాహుల్‌ నిర్ణయించుకోవాలని రౌత్‌ అన్నారు.

Next Story
Share it