Telugu Gateway
Andhra Pradesh

మహిళా చట్టాలపై ప్రచారమే..అమలు లేదు

మహిళా చట్టాలపై ప్రచారమే..అమలు లేదు
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించేందుకే దిశ చట్టం తీసుకొచ్చాం, దిశ స్టేషన్లు పెట్టాం అని ప్రచారం చేసుకొంటున్న ప్రభుత్వం గిరిజన మహిళలపై దాష్టీకాలకు పాల్పడుతున్నా చర్యలు తీసుకొనేందుకు మాత్రం పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. ప్రచారం తప్ప మహిళల మానప్రాణాలకు రక్షణ లభించడం లేదు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని శివాపురం తండాలో గిరిజన మహిళ రమావత్ మంత్రుబాయిని అధికార పార్టీకి చెందిన ఓ వడ్డీ వ్యాపారి ట్రాక్టర్ తో తొక్కించి హత్య చేయడం అమానవీయం. అటవీ భూమిని సాగు చేసుకొంటున్న ఆ గిరిజన కుటుంబంపై కిరాతకానికి పాల్పడ్డ ఆ వడ్డీ వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అటవీ భూమిని తనఖాపెట్టుకోవడమే చట్టరీత్యా నేరం. ఆ భూమిని స్వాధీనం చేసుకొని, మంత్రుబాయి కుటుంబాన్ని ఆ భూమిలోకి అడుగుపెట్టకుండా చేశారని తెలిసింది. గిరిజనులపై ఈ విధంగా దౌర్జన్యాలకు పాల్పడుతూ, అటవీ భూములను గుప్పిటపెట్టుకొంటున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి.

అధికార పార్టీ అండ ఉండటంతో సంబంధిత అధికారులుపట్టించుకోవడం లేదు అనే ప్రజల ఆందోళనపై ప్రజాస్వామ్యవాదులు, గిరిజన సంఘాలు దృష్టిపెట్టాలన్నారు. అంతే కాదు కర్నూలు జిల్లా వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో వాగు వంతెన నిర్మాణపనుల దగ్గర పని చేసే ఓ గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం చోటు చేసుకొంటే పోలీసులు కేసు నమోదు చేసుకోలేదని వివిధ మాధ్యమాల ద్వారా తెలిసింది. భర్త కళ్లెదుటే అత్యాచారం చేశారని బాధితురాలు చెప్పినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక చట్టాలు చేసి ఏమి ప్రయోజనం? మహిళకు ఏ కష్టం వచ్చినా ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి చెప్పుకొంటున్నా క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు.

రాజమండ్రి దగ్గర ఒక దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చోటు చేసుకొంది. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో తరచూ చోటు చేసుకొంటున్నా పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించడం లేదు అంటే వారిపై రాజకీయ ఒత్తిళ్ళు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతోంది. దళిత వర్గానికి చెందిన మహిళ హోమ్ శాఖ మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై ఇలాంటి అమానుషాలు చోటు చేసుకోవడం బాధాకరం. శివాపురం తండా, వెలుగోడు ఘటనలకు బాధ్యులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. వీటికి సంబంధించిన కేసుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

Next Story
Share it