Telugu Gateway
Telangana

గణేష్ ఉత్సవ మండపాలకు అనుమతి లేదు

గణేష్ ఉత్సవ మండపాలకు అనుమతి లేదు
X

తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది గణేష్ ఉత్సవ మండపాలకు అనుమతి లేదని తెలిపింది. ఇళ్ళలోనే విగ్రహలు పెట్టుకుని పండగ చేసుకోవాలని సూచించింది. కరోనా కారణంగా ప్రజలు అందరూ సహకరించాలని కోరింది. అయితే కొద్ది రోజుల క్రితమే భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని..దీనికి ఎవరి అనుమతి అవసరం లేదని ప్రకటించింది. అయితే ఉత్సవ మండపాల వివరాలు మాత్రం పోలీసులకు తెలియజేస్తే సరిపోతుందని ప్రకటించింది. ఇప్పుడు అందుకు భిన్నంగా సర్కారు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సోమవారం నాడు ఈ అంశంపై సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రజలు అందరు గణేష్ ప్రతిమ లను తమ ఇండ్లలోనే ప్రతిష్టించి గణేష్ పండుగ ను సంప్రదాయబద్దంగా జరుపుకొని ప్రభుత్వానికి సహకరించాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అద్యక్ష, కార్యదర్శులు రాఘవరెడ్డి, భగవంతరావు, విశ్వహిందు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, ఇతర ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

మహమ్మారి దృష్ట్యా ప్రజలు, గణేష్ ఉత్సవాల నిర్వాహకులు పరిస్థితులను అవగాహన చేసుకొని ఇండ్లలోనే విగ్రహాలను ప్రతిష్టించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుందన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలను ప్రభుత్వం ఎంతో గౌరవిస్తుందని అన్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని గణేష్ ఆలయాలలో గణేష్ నవరాత్రులు పూర్తయ్యే వరకు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించాలని సమావేశంలో పాల్గొన్న దేవాదాయ శాఖ కమిషనర్ ను మంత్రి ఆదేశించారు. వచ్చే సంవత్సరం బోనాలు, గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ సంవత్సరం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సమకూర్చిన 80 వేల మట్టి గణేష్ విగ్రహాలను జీహెచ్ఎంసీ అధికారులు పంపిణీ చేస్తారని చెప్పారు. అవసరమైతే మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

Next Story
Share it