మోడీ కారణంగా 14 కోట్ల ఉద్యోగాలు ఔట్
నరేంద్రమోడీ ప్రధాన మంత్రి అయిన తర్వాత ఏటా రెండు కోట్ల మందికి కొత్త ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. కానీ ఆయన ప్రధాని అయిన తర్వాత ఏకంగా 14 కోట్ల ఉన్న ఉద్యోగాలు పోయాయని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. నోట్ల రద్దు, జీఎస్టీ, లాక్‌డౌన్ వంటి తప్పుడు విధానాలతో ఈ పరిస్ధితి నెలకొందని విమర్శించారు. ఈ మూడు నిర్ణయాలతో దేశ ఆర్థిక మూలాలనే ధ్వంసం చేశారని ఆరోపించారు. తిరోగమన నిర్ణయాలతో భారత్ ఇప్పుడు యువతకు ఉద్యోగాలు సమకూర్చే స్ధితిలో లేదనేది వాస్తవమని అన్నారు.
తమ పార్టీ యువజన విభాగం యువతకు ఉద్యోగాలను కోరుతూ పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని చేపడతుందని చెప్పారు. ఉద్యోగాలు కల్పించండి (రోజ్‌గార్ దో) అంటూ 90 సెకన్ల నిడివి కలిగిన వీడియోను రాహుల్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నిరుద్యోగులు, యువత ఉద్యోగాల కోసం ఈ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రచారోద్యమం చేపట్టాలని ఆయన పిలుపు ఇచ్చారు.