రాయలసీమ ఎత్తిపోతలపై ‘మెఘా దొంగాట’ ఎందుకు?

జమ్మూ కాశ్మీర్ లో టెండర్ దక్కితే మాత్రం మెఘా ఇంజనీరింగ్ సంస్థ ఘనంగా ప్రకటించుకుంటుంది. తప్పేమీ లేదు. వచ్చిన టెండర్ గురించి చెప్పుకోవటాన్ని ఆక్షేపించాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఏపీకి సంబంధించిన రాయలసీమ ఎత్తిపోతల టెండర్ విషయంలో మాత్రం మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మాత్రం ఎందుకు దొంగాట ఆడుతోంది. ఇప్పుడు ఇదే ఏపీలోని రాజకీయ, అధికార వర్గాల్లో హాట్ టాపిక్. మెఘా ఇప్పుడు దేశంలోని అగ్రశ్రేణి మౌలికసదుపాయాల కంపెనీల్లో ఒకటిగా ఉంది. అసలు ఈ సంస్థకు ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు అయినా సొంతంగానే దక్కుతుంది. కానీ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో మాత్రం ఎందుకు సుభాష్ ప్రాజెక్ట్స్ , ఎన్ సీసీతో కలసి జెవీగా వెళ్లింది. ఈ జెవీకే ప్రాజెక్టు దక్కినా కూడా మెఘా పేరు ఎక్కడా బయటకు రాకుండా ఎందుకు చూసుకుంటుంది? అన్నది ఆసక్తికర పరిణామం. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కారు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కానీ ఏపీ సర్కారు మాత్రం రాష్ట్రానికి కేటాయించిన జలాలతోనే ఈ ప్రాజెక్టు కడుతున్నామని..అదనంగా ఒక్క చుక్క కూడా తీసుకోబోమని చెబుతోంది.
మెఘా ఇంజనీరింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయల పనులు చేసింది..ఇప్పుడు కూడా చేస్తోంది. కానీ తెలంగాణ సర్కారు వ్యతిరేకిస్తుందనే ఏకైక కారణంతోనే మెఘా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ తమ పేరు అధికారికంగా రాకుండా చూసుకుంటోందని చెబుతున్నారు. అంటే ఆ మాత్రం తెలంగాణ సీఎం కెసీఆర్ కు, తెలంగాణ ప్రజలకు తెలియకుండా పోతుందా?. అయినా ఓ కంపెనీ ఫని ఏంటి...ఎక్కడ టెండర్ ఉంటే అక్కడ బరిలో నిలిచి దానిని దక్కించుకోవటమే. అలాంటిది ఏ ప్రాజెక్టు విషయంలో లేని తరహాలో ఒక్క రాయలసీమ ఎత్తిపోతల విషయంలో మాత్రం ఎందుకు మెఘా ఇంజనీరింగ్ ఈ దొంగాట ఆడుతోంది?. జల వివాదాలు రాష్ట్రాల మధ్య పరిష్కారం కావాల్సిందే కానీ...ఇందులో కాంట్రాక్టర్లు..కంపెనీలు చేసేది ఏమీ ఉండదు. అలాంటిది ఒక టెండర్ విషయంలో ఘనంగా ప్రకటించుకుని..మరో టెండర్ విషయంలో పేరు బయటకు రాకుండా చూసుకోవటం..దీని కోసం ప్రయత్నాలు చేయటంలో మతలబు ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది. పాలకులు ఎవరైనా ఒక్క కంపెనీకే వేల కోట్ల రూపాయల టెండర్లు అన్నీ ఎలా వస్తున్నాయన్నది వేరే అంశం. ఓ వైపు నవయుగా సంస్థకు జగన్ సీఎం అయిన దగ్గర నుంచి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. మచిలీపట్నం ఓడరేవు ఒప్పందం రద్దు అన్నారు. పోలవరం విద్యుత్ ప్రాజెక్టు రద్దు చేశారు. కృష్ణపట్నం ఇన్ ఫ్రాటెక్ భూ కేటాయింపులు రద్దు చేశారు.
ఆ కంపెనీ కోర్టులకు వెళ్లింది...తర్వాత కొన్ని సర్దుబాట్లు అయ్యాయి. కొన్ని అలా నడుస్తున్నాయి. అయినా సరే ఈ కంపెనీ కూడా రాయలసీమ ఎత్తిపోతల బరిలో నిలిచింది అంటే..సింగిల్ టెండర్ అయితే ఇబ్బందులు వస్తాయనే ఈ సంస్థను కూడా తెరపైకి తెచ్చినట్లు సాగునీటి శాఖ వర్గాలు చెబుతున్నాయి. లిఫ్ట్ టెండర్ అంటే మెఘా ఏ మాత్రం వదలదు అనే విషయం తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. అలాంటిది జెవీతో కలసి వెళ్ళటమే ఓ వింత అయితే..అందులో పేరు బయటకు రాకుండా చూసుకోవటం మరో విచిత్రం. ఈ టెండర్లు ఫైనలైజ్ అయిన తర్వాత ప్రధాన పత్రికలు అన్నింటిలో సుభాష్ ప్రాజెక్ట్స్ జెవీ అని రాశారు తప్ప..అందులో భాగస్వాములు ఎవరు అన్నది మాత్రం రాయకుండానే వదిలేశారు. ఏపీ సర్కారు 3307 కోట్ల కు ఈ పనులు అప్పగించనుంది. వాస్తవానికి 3278.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్లు పిలవగా...0.88 శాతం ఎక్సెస్ తో ఈ టెండర్ వెళ్ళింది. మామూలుగా రివర్స్ టెండరింగ్ అంటే లెస్ కు వెళతారు..సర్కారుకు లాభం చేకూరుస్తాం అంటూ ప్రకటించారు. కానీ ఇక్కడ మాత్రం రివర్స్ లో ఎక్సెస్ కు వెళ్లింది.