జె సీ ప్రభాకర్ రెడ్డి మళ్లీ అరెస్ట్
జైలు నుంచి విడుదలై ఒక్క రోజు కూడా గడవక ముందే మాజీ ఎమ్మెల్యే జె సీ ప్రభాకర్ రెడ్డి మళ్ళీ అరెస్ట్ అయ్యారు. ఆయనపై తాజాగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, లాక్‌డౌన్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. వైద్య పరీక్షల కోసం జేసీ ప్రభాకర్‌రెడ్డిని జీజీహెచ్‌కు తరలించారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డి కండీషన్ బెయిల్‌పై గురువారమే విడుదలైన సంగతి తెలిసిందే. జేసీ విడుదల సందర్భంగా కడప సెంట్రల్ జైలు వద్ద ఆయన వర్గీయులు నానా హంగామా చేస్తూ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కింద జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్, పవన్‌కుమార్ సహా 31 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు జేసీ, అస్మిత్‌లు కడప సెంట్రల్ జైలు నుంచి తాడిపత్రి వరకు అనుచరగణంతో ర్యాలీగా వచ్చారు. ఈ క్రమంలో జేసీ దళిత సీఐ దేవేంద్రను బహిరంగంగా బెదిరించారు. దీంతో సీఐ పట్ల దురుసుగా ప్రవర్తించిన జేసీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కడప నుంచి తాడిపత్రి వరకు లాక్‌డౌన్ నిబంధనలు జేసీ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు తెలిపారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై 506, 189, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. వీటితోపాటు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ 52 కింద కూడా జేసీపై కేసు నమోదు చేశారు.