Telugu Gateway
Andhra Pradesh

ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ కీలక వ్యాఖ్యలు

ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ కీలక వ్యాఖ్యలు
X

దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా మహానగరాలు తమకు లేవని, ఆ నగరాల్లో ఉన్నట్టుగా భారీ మౌలిక సదుపాయాలు ఉన్న ఆస్పత్రులూ లేవని వైఎస్‌ జగన్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో వైద్య సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులను సాధ్యమైనంత వేగంగా గుర్తించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 25 లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేశామని తెలిపారు. ప్రతి పది లక్షల మందికి 47,459 పరీక్షలు జరిపామన్నారు. మరణాలు రేటు 0.89 శాతంగా ఉందన్నారు.

క్లస్టర్లలోనే 85 నుంచి 90శాతం వరకూ పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. కోవిడ్‌ వచ్చే నాటికి రాష్ట్రంలో వైరాలజీ ల్యాబ్‌ కూడా లేదని, ఇప్పుడు ప్రతి పది లక్షల మందికి 47 వేలకు పైగా పరీక్షలు చేస్తున్నామని సీఎం జగన్‌ ప్రధాని మోదీ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ల్యాబ్‌లు ఉన్నాయని, టెస్టుల విషయంలో స్వాలంబన సాధించామని తెలిపారు. దాదాపు 2లక్షల మంది వాలంటీర్లు క్షేత్రస్థాయిలో కోవిడ్‌ నివారణా చర్యల్లో పాల్గొంటున్నారని సీఎం వెల్లడించారు. అవసరమైన అందరికి టెస్టులు చేస్తున్నామని, ప్రతి రోజు 9 వేల నుంచి 10 వేల కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లు కేవలం 3,286 మాత్రమే ఉండేవని తెలియజేశారు. ప్రస్తుతం రాష్టంతో 11 వేలకుపైగా ఆక్సిజన్‌ బెడ్లు ఉన్నాయని వెల్లడించారు. గడచిన మూడు నెలల్లో దాదాపు 7వేలకు పైగా బెడ్లు సమకూర్చుకున్నామని ప్రధాని మోదీకి సీఎం జగన్‌ వివరించారు.

Next Story
Share it