Telugu Gateway
Andhra Pradesh

ఫోన్ ట్యాపింగ్ లపై మోడీకి చంద్రబాబు లేఖ

ఫోన్ ట్యాపింగ్ లపై మోడీకి చంద్రబాబు లేఖ
X

ఏపీ సర్కారు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన సోమవారం నాడు ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. అంతే కాదు అధికార వైసీపీ ఇప్పుడు ప్రజాస్వామ్యానికి మూడవ స్తంబం అయిన న్యాయవ్యవస్థను కూడా టార్గెట్ చేసిందని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1885 [సెక్షన్ 5 (2)] మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 [సెక్షన్ 69] ప్రకారం టెలిఫోన్ ట్యాపింగ్ జాతీయ భద్రతకు ముప్పు ఉన్న సందర్భంలో లేదా సార్వభౌమాధికారం, దేశ సమగ్రత ప్రయోజనాల కోసం, విదేశాలతో స్నేహ పూర్వక సంబంధాలకు ముప్పు వాటిల్లే సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ చేయడం కద్దు. దైనందిక జీవితంలో వివిధ వర్గాల ప్రజల ఫోన్లను ట్యాప్ చేయడంలో చట్టబద్ధమైన ఎటువంటి విధానాన్ని వైయస్ఆర్సిపి నేతృత్వంలోని ప్రభుత్వం పాటించడం లేదనేది దీనినిబట్టే తెలుస్తోంది.

రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 19 మరియు ఆర్టికల్ 21లో హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులకు ఉల్లంఘించడమే ఇది. ఇల్లీగల్ సాఫ్ట్‌ వేర్ ద్వారా, చట్టవిరుద్ధంగా ఈ ట్యాపింగ్ జరుగుతోందని ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. దీర్ఘకాలంలో జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు తెచ్చే అవకాశం ఉన్నందున ఇది మరింత ప్రమాదకరమైనది. ఇటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం దుండగుల చేతిలో ఉండడం వల్ల వ్యక్తుల గోప్యత హక్కును కాలరాయడమే కాకుండా, అత్యున్నత స్థానాల్లోని వ్యక్తులను తమ దారికి తెచ్చుకోడానికి బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులకు గురిచేయడానికి దారితీస్తుంది. ఏ విధంగానైనా తమ అధికారాన్ని నిలుపుకోవాలనే తపనతో అధికార పార్టీ వైఎస్సార్సీపి దారుణంగా బెదిరిస్తోందని దీనిపై విచారణకు ఆదేశించాలని ప్రధాని మోడీని కోరారు. ఇదే లేఖ ప్రతిని కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ కు కూడా పంపారు.

Next Story
Share it