Telugu Gateway
Politics

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఎన్ఆర్ఏ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఎన్ఆర్ఏ
X

కేంద్ర మంత్రివర్గం బుధవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులకు సంబంధించిన ఖాళీల భర్తీకి సంబంధించిన పరీక్షలు అన్నీ ఇక నుంచి ఒకే ఏజెన్సీ నిర్వహించనుంది. దీని కోసం జాతీయ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఏ) ఏర్పాటు చేశారు. ఈ ప్రతిపాదనకు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నిర్ణయం దేశంలో ఉద్యోగాలు కోరుకునే యువతకు తోడ్పాటు అందిస్తుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేవకర్ తెలిపారు. ప్రస్తుతం నియామక పరీక్షలను యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ వంటి సంస్ధలు నిర్వహిస్తున్నాయి. ఇక నుంచి సింగిల్ పాయింట్ లోనే పరీక్షలు నిర్వహిస్తారు.

ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్రం తెలిపింది. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు ఇది దోహదపడుతుందని..దీని ద్వారా యువత ప్రయోజనం పొందుతారని తెలిపారు. ఈ నియామకాల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లే అమలు అవుతాయని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యంలో (పీపీపీ) మోడల్ కింద జైపూర్, తిరువనంతపురం, గౌహతి ఎయిర్‌పోర్టులను లీజుకు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ లను ప్రైవేట్‌ డెవలపర్‌కు అప్పగించడం ద్వారా ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు 1070 కోట్ల రూపాయలు సమకూరుతాయని మంత్రి తెలిపారు.

Next Story
Share it