రియా చక్రవర్తిపై సీబీఐ కేసు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో సీబీఐ రంగంలోకి దిగింది. ఎన్నో ట్విస్ట్ ల మధ్య కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ మరణానికి సంబంధించి గత కొన్ని రోజులుగా రోజుకొక కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. ఓ వైపు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగి సుశాంత్ సింగ్ ఖాతాలను నుంచి నిధులు ఎవరెవరి ఖాతాలకు వెళ్లాయనే అంశంపై కూపీ లాగుతోంది. ఈ తరుణంలో సుశాంత్ మృతి కేసులో ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై సీబీఐ గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
ఈ కేసులో రియాతో పాటు ఇంద్రజిత్ చక్రవర్తి, సంధ్యా చక్రవర్తి, షోయిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరంద, శ్రుతి మోదీ ఇతరుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచింది. జూన్ 14న ముంబయ్ లోని బాంద్రా అపార్ట్ మెంట్‌లో సుశాంత్ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తునకు సీబీఐ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. గుజరాత్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం సుశాంత్ మృతిపై దర్యాప్తు సాగిస్తుంది. విచారణను డీఐజీ గగన్‌దీప్ గంభీర్ పర్యవేక్షిస్తారు.